ప్రాణహితకు ‘మహా’ సీఎం వ్యతిరేకి
మంత్రి పోచారం
బాన్సువాడ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించవద్దంటూ ఆందోళనలు చేశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నిం చారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని మరుగున పడేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఏటా సుమారు 1,000 టీఎంసీల నీరు వచ్చి గోదావరిలో కలుస్తోందని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి, సుమారు 470 టీఎంసీల నీటిని మళ్లించేందుకు రూ.35 వేల కోట్లతో పథకం రూపొందించామని తెలిపారు.
కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరులోకి, అటు నుంచి మెదక్‌కు, తూఫ్రాన్‌కు, అక్కడి నుంచి హల్దీవాగు మీదుగా నిజాం సాగర్‌లోకి నీరు మళ్లిస్తామని వివరించారు. దీంతో 365 రోజుల పాటు కాలువల్లో నీరు ఉంటుందని, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. తెలంగాణలో ఉన్నది ‘మోతేబర్’ ప్రభుత్వమని, అందుకే ప్రపంచ బ్యాంకుతో పాటు జపాన్, అమెరికన్ తదితర బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పథకాలను చూసి కాంగ్రెస్‌కు మతి పోతోందని, భవిష్యత్తులో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.