
‘ప్రేమమ్’కు రికార్డు కలెక్షన్లు!
అక్కినేని నాగాచైతన్య తాజా సినిమా ‘ప్రేమమ్’ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మలయాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్‌టాక్ రావడం కలిసి వచ్చింది. దీంతో చైతూ సినిమాల పరంగా కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదుచేస్తున్నది.
అమెరికాలో ఈ సినిమా రెండురోజుల్లోనే అర మిలియన్ డాలర్ మార్క్ (రూ. 3.32 కోట్ల) కు చేరువగా వచ్చింది. నాగార్జున, వెంకటేశ్ అతిథి పాత్రల్లో మెరిసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిరంగా వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక, బ్లూస్కై సినిమాస్ సంస్థ ‘ప్రేమమ్’ విదేశీ హక్కులను సొంతం చేసుకొని.. ఉత్తర అమెరికా అంతటా 120 తెరల్లో విడుదల చేసింది. ఈ సినిమా అమెరికాలో తొలిరోజు 1,34,819 డాలర్ల వసూళ్లను రాబట్టింది. నాగాచైతన్య సినిమాల్లో అమెరికాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే. గతంలో ‘దోచేయ్’ సినిమా పేరిట ఈ రికార్డు ఉండేది.
మూడురోజుల్లో ‘దోచెయ్’ 1.30 లక్షల డాలర్ల కలెక్షన్లు రాబట్టగా.. తొలిరోజే ‘ప్రేమమ్’ అంతకుమించి రాబట్టింది. ఇక గురువారం ప్రీమియర్ షోల ద్వారా 74,219 డాలర్లు వసూలయ్యాయి. ప్రీమియర్ షోలు, తొలిరోజు వసూళ్ల ద్వారా ‘ప్రేమమ్’ సినిమా 2.09 లక్షల డాలర్లు (రూ. 1.39 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక రెండోరోజు శనివారం 1.57 లక్షల డాలర్లు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా 3.66 లక్షల డాలర్ల (రూ. 2.4 కోట్ల) వసూలు చేసిందని, మున్ముందు ‘ప్రేమమ్’ వసూళ్లు మరింతగా పెరగొచ్చునని అంటున్నారు.