ప్రైవేట్ ఎంసెట్ వ్యవహారంపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద మొదటి ఏడాది ఫీజుతో పాటు మిగతా నాలుగేళ్లకూ ముందే బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు యాజమాన్యాలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘‘బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు ఇదేమైనా జాతీయ రహదారి నిర్మాణ పనుల వ్యవహారమా? ఇలాంటి జీవో ఇచ్చే అధికారం మీకెక్కడిది?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జీవోను సవాలు చేస్తూ కామినేని వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థిని మృదుల, మరికొందరు వేర్వేరుగా వేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇలా బ్యాంకు గ్యారంటీ తీసుకునే విధానం దేశంలో ఎక్కడా లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవీందర్ వాదించారు. విద్యార్థులు మధ్యలో మానేస్తే కాలేజీలు నష్టపోతాయని, అందుకే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ నిబంధన అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
‘బ్యాంకు గ్యారంటీ’కి జీవోనా?
Published Wed, Aug 26 2015 4:08 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement