ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై స్టే
జీవో ద్వారా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ సరికాదన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.5పై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-101ను అనుసరించి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఉమ్మడి ఏపీలో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అది తెలంగాణ రాష్ట్రానికి చట్టం అవుతుందని... కాబట్టి చట్టానికి సవరణలను శాసనవ్యవస్థ ద్వారానే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ ప్రాథమిక అభిప్రాయం ఆధారంగా జీవో నం.5పై స్టే విధిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పాత విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లను వీలైనంత త్వరగా ఖరారు చేసి, శనివారం లేదా అంతకన్నా ముందే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రిజర్వేషన్ల ప్రకటన వచ్చిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి గరిష్టంగా 31 రోజుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు పిటిషన్లపై విచారణ..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను కుదించి, ఆ మేర జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.5ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన చక్కిలం రఘునాథరావు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు గ్రేటర్ ఎన్నికల నిర్వహణ గడువును మరో 45 రోజుల పాటు పొడిగించాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.
ప్రభుత్వానికి ఉన్న అధికారంతోనే...
తొలుత చట్ట సవరణ ద్వారా ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియను కుదించవచ్చా, చట్టాన్ని అడాప్ట్ చేసుకున్న తరువాత దానికి సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామమూర్తి స్పందిస్తూ... ఆ చట్టానికి సవరణ చేయవచ్చని, కానీ అది కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాకుండా శాసన వ్యవస్థ ద్వారా జరగాలని కోర్టుకు వివరించారు. దీంతో తమ ఉద్దేశం ప్రకారం కూడా ఆ కుదింపు సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ సమయంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-101 ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్న ఏదైనా చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటే, అపాయింటెడ్ డే నుంచి రెండేళ్లలోపు ఆ చట్టానికి సవరణలు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనానికి తెలిపారు. బిహార్ రాష్ట్ర విభజన కేసులో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందంటూ.. ఆ తీర్పు ప్రతిని చదివి వినిపించారు. ఈ మేరకు సెక్షన్-101 కింద తమకున్న అధికారాన్ని ఉపయోగించి చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.
ఏజీ వాదనతో ఏకీభవించలేం...
ఏజీ వివరణ అనంతరం సీతారామమూర్తి జోక్యం చేసుకుంటూ... జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఎందుకు ఎన్నికల షెడ్యూల్‌ను కుదించారనే కారణాలను వివరించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ప్రభుత్వ వాదనలతో ఏకీభవించడం కొంత కష్టసాధ్యంగా ఉందని వ్యాఖ్యానించింది. చట్టాన్ని అడాప్ట్ చేసుకునేటప్పుడే దానిలో మార్పులు, సవరణలు చేయాలని పేర్కొంది. ఆ సమయంలో సవరణలు చేయకపోతే తరువాత శాసనవ్యవస్థ ద్వారానే సవరణలు చేసేందుకు అవకాశం ఉందని, ఇది తమ ప్రాథమిక అభిప్రాయమని ధర్మాసనం తెలిపింది.
అసలు నోటిఫికేషన్ జారీ తరువాత ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జి.విద్యాసాగర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి 22 నుంచి 25 రోజుల సమయం పడుతుందని విద్యాసాగర్ తెలిపారు. దీంతో రిజర్వేషన్లను ఎప్పుడు జారీ చేయగలరనేదానిపై ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని ఏజీ రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ.. ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
కుదింపుతో ఇబ్బందులు..
మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభం కాగానే.. రిజర్వేషన్ల ప్రకటన తేదీని నిర్దిష్టంగా చెప్పలేమని, ఒకటి రెండు రోజుల్లో జారీ చేసే అవకాశం ఉందని రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో మర్రి శశిధర్‌రెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ... ఎన్నికల షెడ్యూల్ కుదింపు వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం... సెక్షన్-101 కింద చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా, లేదా? అన్న వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సంక్రాంతి సెలవుల తరువాత ఆ పని చేస్తామని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ కుదిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.