ఆ హీరో.. నన్ను దారుణంగా మోసగించాడు: నిర్మాత
- 50-50శాతం థియేటర్లు ఇవ్వలేదు
- నాకు 150 కోట్ల నష్టం రావొచ్చు
షారుఖ్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 'రాయిస్' సినిమాపై హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేష్ రోషన్ బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. అందుకు కారణం లేకపోలేదు. హృతిక్ హీరోగా తెరకెక్కిన 'కాబిల్' సినిమాను ఈ రోజున (జనవరి 25న) విడుదల చేస్తామని ఎంతో ముందుగానే రాకేశ్ ప్రకటించారు. ఆ తర్వాత పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన షారుఖ్ 'రాయిస్' కూడా బుధవారమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించింది. దీంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద టైటానిక్ క్లాష్ తప్పలేదు. షారుఖ్ తన సినిమా విడుదల తేదీని మార్చుకుంటారని అంతా భావించారు. షారుక్ దిగిరాలేదు. హృతిక్‌యే పెద్ద మనస్సు చేసుకొని.. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైనా తమ మధ్య విభేదాలు రాకుండా చూస్తామని చెప్పాడు. దీంతో రెండు సినిమాలకు దేశంలోని థియేటర్లను 50:50శాతం పంచుకోవాలని మొదట భావించారు. కానీ, చివరి నిమిషంలో రాకేష్ రోషన్‌కు షాక్ ఇస్తూ 'రాయిస్'కు అనుకూలంగా 60:40 శాతం థియేటర్లను పంచారు. దీంతో బిత్తరపోయిన రాకేష్ తన సినిమాను షారుఖ్ మోసం చేశారని వాపోతున్నారు.
'నేను వేరేవాళ్ల సినిమా గురించి మాట్లాడాను. నా సినిమా కాబిల్ గురించే మాట్లాడుతాను. సినిమా విడుదల విషయంలో మేం షాక్‌కు గురయ్యాం. బాధపడ్డాం. నిరాశ చెందాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. గతవారం ఎగ్జిబిటర్లందరితోనూ మాట్లాడి వారికి గంట సినిమా కూడా చూపించాం. 50-50శాతం థియేటర్లు ఇవ్వాలని కోరాం. అందుకు వారు ఒప్పుకొన్నారు కూడా. దుబాయ్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఇలా ప్రపంచమంతటా 50-50 షేర్‌కు అంగీకారం కుదిరింది. కానీ ఆ తర్వాత వారు చేసింది మమ్మల్ని బాధించింది. మేం మోసపోయామనిపించింది. ఇలా చేయడం సరికాదు. రెండు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు 50-50 థియేటర్ల పంపకాలు ఉండాలని నిర్మాతలంతా కోరుకుంటారు' అని పేర్కొన్నారు. దర్శకుడు, నిర్మాత అయిన రాకేశ్ రోషన్ 90వ దశకంలో షారుఖ్‌కు ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. షారుఖ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'కరణ్ అర్జున్' సినిమాను కూడా ఆయనే తీశారు.
థియేటర్లను 60-40 శాతం పంపకాలు చేయడం వల్ల తనకు నేరుగా 150 కోట్ల నష్టం వస్తుందని, ఒకేసారి రెండు సినిమాలు చూసేంత డబ్బు ప్రజల వద్ద ఉండదని, కాబట్టి థియేటర్ల పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల తన సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా దేవుడు తనకు అండగా ఉన్నాడని, తనకేమీ కాదని అన్నారు. షారుఖ్ తీరుపై ఆయన పరోక్షంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.