స్విట్జర్లాండ్‌లో మినీ ప్రపంచం!
దావోస్: పర్యాటకుల స్వర్గధామమైన స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరం ఒక మినీ ప్రపంచంలా మారిపోనుంది. ఏంటి వింతగా ఉందా? ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం ఇక్కడికి వస్తున్న దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు, కంపెనీల సీఈఓలతో దావోస్ చిన్నసైజు ప్రపంచాన్ని తలపించబోతోంది. చుట్టూ మంచుతో స్కీయింగ్ రిసార్ట్‌గా పేర్కొందిన ఈ నగరంలో 43వ వార్షిక డబ్ల్యూఈఎఫ్ సదస్సు నేటి నుంచి 5 రోజుల పాటు జరగనుంది. దీనికి భారత్ నుంచి కేంద్ర మంత్రులు, అనేక కంపెనీల అధినేతలు సహా మొత్తం 125 మంది భారీ ప్రతినిధుల బృందం హాజరవుతోంది. మంగళవారం సాయంత్రం ఈ సదస్సును డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ స్క్వాబ్ అధికారికంగా ప్రారంభిస్తారు. 22-25 వరకూ చర్చలు, సంప్రదింపుల సెషన్స్ జరుగుతాయి.
ఇవీ వివరాలు...
సదస్సు ఎక్కడ: స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో
ఇది ఎన్నోసారి: ఇక్కడ 43వ సారి జరుగుతోంది
ఎప్పటిదాకా: ఈ నెల 21 నుంచి 25 వరకూ(5 రోజులు)
ఎంతమంది వస్తున్నారు: మొత్తం 2,500 మంది. వీరిలో 1,500 మంది వ్యాపార ప్రతినిధులే.
ఈ ఏడాది థీమ్: మారుతున్న ప్రపంచం: సమాజం, రాజకీయాలు, వ్యాపారంపై దీని ప్రభావం
ఎవరెవరు ఉంటారు: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల ప్రతినిధులు. ఇందులో 40 దేశాల అధిపతులు, నాయకులు, కార్పొరేట్ వర్గాలు ప్రధానంగా ఉంటారు. ఆతిథ్య స్విట్జర్లాండ్ సహా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, కొరియా, భారత్ తదితర దేశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు జీ-20 కూటమి దేశాధినేతలు సైతం ప్రసంగించనున్నారు. వందలకొద్దీ టాప్ కంపెనీల సీఈఓలు. పేరొందిన అపర కుబేరులు కూడా రానున్నారు.
సదస్సులో ఏం చేస్తారు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులు, వాణిజ్య అంశాలూ ఇందులో ప్రధానంగా ఉంటాయి. యూరోజోన్‌లో సంక్షోభం నేపథ్యంలో దీని భవిష్యత్తుపైనా దృష్టిసారించే అవకాశం.
అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు కూడా: ఐక్యరాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) డెరైక్టర్ జనరల్ రోబర్టో అజెవెడో తదితరులు కొలువుదీరనున్నారు.
అంతర్జాతీయ కంపెనీల క్యూ: పెప్సీకో, ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, టోటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మైక్రోసాప్ట్, బ్రిటిష్ పెట్రోలియం, సిటీ గ్రూప్, డాయిష్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, ఫోక్స్‌వ్యాగన్, యూబీఎస్, యూనిలీవర్, స్టాన్‌చార్ట్ వంటివి ఇందులో కొన్ని.
భారత్ నుంచి పాల్గొంటున్నదెవరు
ఆర్థిక మంత్రి పి. చిదంబరం, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పట్టణాభివృద్ధి-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్, భారీ పరిశ్రమలు-ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వం తరపున ప్రధానంగా హాజరుకానున్నారు.
మన కార్పొరేట్లలో ముఖ్యులు..
భారత్ నుంచి మొత్తం 100 మంది కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. వీరిలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, గోద్రెజ్ గ్రూప్ అధినేత ఆది గోద్రెజ్, జీఎంఆర్ గ్రూప్ అధిపతి జీఎం రావు, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, భారతీ గ్రూప్ సీఎండీ సునీల్ మిట్టల్, గౌతమ్ అదానీ, సీఐఐ ప్రెసిడెంట్ క్రిస్ గోపాలకృష్ణన్, పవన్ ముంజాల్, నైనా లాల్ కిద్వాయ్, నరేశ్ గోయెల్ తదితర ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. 2014 సదస్సుకు సహాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారిలో క్రిస్ గోపాలకృష్ణన్ కూడా ఒకరు. సమావేశాల్లో బాలీవుడ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ను కూడా నిర్వహించనుండటం గమనార్హం.