
‘హిజ్రాల హక్కుల రక్షణ’కు ఓకే
డీఎంకే ఎంపీ తెచ్చిన ప్రైవేట్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని హిజ్రాల హక్కుల రక్షణ అంశానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లును రాజ్యసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘ది రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ బిల్-2014’ ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో 36 ఏళ్ల తర్వాత ఒక ప్రైవేట్ బిల్లుకు ఆమోదం లభించడం గమనార్హం. 1979లో ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సవరణ బిల్లు’ను రాజ్యసభ ఆమోదించింది. తాజా బిల్లుపై తొలుత కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడారు. హిజ్రాల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ఉత్తమ బిల్లు రూపొందిస్తుందని, ప్రైవేటు బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు.
అయితే శివ తాను తెచ్చిన బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టారు. మంత్రి అరుణ్‌జైట్లీ కలుగజేసుకుని.. హిజ్రాల హక్కుల రక్షణపై అందరూ సానుకూలంగానే ఉన్నందున ఏకగ్రీవంగా ఆమోదిద్దామన్నారు. ప్రభుత్వానికి మంచి అవకాశమని, బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అన్నారు. సభలోనే ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్‌తో పాటు 19 మంది కేంద్ర మంత్రులు, అధికార సభ్యులంతా మద్దతు పలికారు.
తర్వాత బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం శివ సభలోని సీనియర్ నేతల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 4.5 లక్షల మంది హిజ్రాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని.. కానీ 20 నుంచి 25 లక్షల మంది వరకు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని తిరుచ్చి పేర్కొన్నారు. వారి హక్కులకు ఎలాంటి గుర్తింపు లేనందున వివక్షకు గురవుతున్నారని, ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే వారి హక్కులకు రక్షణ లభిస్తుందన్నారు.