37 సార్లు సూపర్‌ హిట్‌ | PSLV-C36 Successfully Launches Resource sat -2A; ISRO | Sakshi
Sakshi News home page

37 సార్లు సూపర్‌ హిట్‌

Published Thu, Dec 8 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

37 సార్లు సూపర్‌ హిట్‌

37 సార్లు సూపర్‌ హిట్‌

ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో విజయపరంపర కొనసాగుతోంది..

- కక్ష్యలోకి రిసోర్స్‌శాట్ 2ఏ.. పీఎస్‌ఎల్‌వీ 36 ద్వారా ప్రయోగం

శ్రీహరికోట (సూళ్లూరుపేట):
ఉపగ్రహ ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా బుధవారం పీఎస్‌ఎల్‌వీ సీ36 ఉపగ్రహ వాహకనౌక ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ‘రిసోర్స్‌శాట్-2ఏ’ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ప్రధానంగా పంటల విస్తీర్ణం, దిగుబడి అంచనా, కరవు ప్రాంత పర్యవేక్షణ, నేల తీరు.. తదితర వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తుంది. అలాగే, పట్టణ ప్రణాళికకు అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. బుధవారం ఉదయం 10.24 గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి  ప్రయోగవేదిక నుంచి దీనిని ప్రయోగించారు.

ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ-సీ36 ద్వారా 1235 కిలోల బరువున్న రిసోర్స్‌శాట్-2ఏ అనే స్వదేశీ ఉపగ్రహాన్ని 17.05 నిమిషాల్లో భూమికి 824 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధవకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో 98.725 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగానికి 36 గంటల ముందు అంటే సోమవారం రాత్రి 10.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ప్రయోగమిలా..
36 గంటల కౌంట్‌డౌన్ అనంతరం.. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ36 రాకెట్ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల, కోర్ అలోన్ దశ సాయంతో  సరిగ్గా 10.24 గంటలకు ఎరుపు, నారింజ రంగుల నిప్పులు చిమ్ముకుంటూ నింగికి  పయనమైంది. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనంతో పాటు కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సాయంతో 110.1 సెకన్లకు మొదటిదశను పూర్తి విజయవంతంగా పూర్తి చేశారు.  ఆ తరువాత 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో 261.4 సెకన్లకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 523.8 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1015 సెకన్లకు నాలుగోదశను దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం నాలుగోదశ అనంతరం రాకెట్ పై భాగంలో అమర్చిన రిసోర్స్‌శాట్-2ఏను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన వెంటనే సోలార్ ప్యానెల్స్ విజయవంతంగా విచ్చుకున్నాయి. బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం ఉపగ్రహం పనితీరును సమీక్షించి, విజయవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ సహచర శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది 9 ప్రయోగాలు చేశామని, ఇందులో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఆరు ప్రయోగాలు చేసి వరుస విజయాలు సాధించామని కిరణ్ కుమార్ చెప్పారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది వరుసగా 37వ విజయమని చెప్పారు.  ఇదే తరహా ఉపగ్రహాలను గతంలో 2003 అక్టోబర్ 10న పీఎస్‌ఎల్‌వీ సీ5 ద్వారా రిసోర్స్‌శాట్-1 ఉపగ్రహాన్ని, 2011 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ16 ద్వారా రిసోర్స్‌శాట్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ రెండు ఉపగ్రహాలతో అనుసంధానమై తాజాగా ప్రయోగించిన రిసోర్స్‌శాట్ 2ఏ పనిచేస్తుంది. ఇవి భూమిపై వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యుత్తమ సేవలందిస్తాయి. అలాగే, పట్టణ ప్రణాళికకు అవసరమైన సమాచారాన్ని కూడా అందిస్తాయి.

షార్ నుంచి 57వ ప్రయోగం
ఈ ప్రయోగంతో  సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి ఇస్రో 57 ప్రయోగాలు పూర్తి చేసింది. వీటిలో 49 ప్రయోగాలు విజయవంతం కాగా, అందులో 37 విజయాలు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారానే జరగడం విశేషం.

ఇక 12 రోజులకు ఒకసారి..
రిసోర్స్ శాట్ 2 ఏలో మూడు రకాల పేలోడ్‌‌స (త్రీ టైర్ ఇమేజింగ్ సిస్టం) అమర్చి పంపుతున్నారు. ఇందులో లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్-3), లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్స్ (లిస్ -4) అనే రెండు పేలోడ్‌‌సతో పాటు అడ్వాన్‌‌సడ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్ అనే పరికరాలను అమర్చి పంపుతున్నారు. ప్రస్తుతం ఉన్న రెండు ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని స్కాన్ చేసిన తరువాత మళ్లీ అదే ప్రాంతాన్ని మళ్లీ స్కాన్ చేయడానికి 24 రోజుల సమయం తీసుకుంటున్నాయి. రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి వస్తే మూడు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకు ఒకసారి ఆ ప్రాంతాన్ని స్కాన్ చేయగలుగుతాయి.

గొప్ప విజయం: మోదీ
పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘రిసోర్స్‌శాట్ 2ఏ ప్రయోగం గొప్ప విజయం. మనందరికీ గర్వకారణం. ఇస్రో టీమ్‌కు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

‘ఇస్రో’కు శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్‌వీ సి- 36 ద్వారా రిసోర్స్‌శాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మకమైన ఘన విజయాలను భవిష్యత్తులో సాధించాలని ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement