అద్దెలో టాప్ పంజాగుట్ట..!
- పెరుగుదలలో ప్రపంచంలోనే 8వ స్థానం
- ఆసియాలో చూస్తే హాంకాంగ్ తరవాత ఇదే
- ఏడాదిలో ఏకంగా 29.2 శాతం పెరిగిన అద్దె
- నగల దుకాణాలు, బిజినెస్ సెంటర్లే కారణం...
- కుష్‌మన్ అండ్ వే క్‌ఫీల్డ్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అద్దెల విషయంలో హైదరాబాద్ మామూలుగానే ఉన్నా పంజాగుట్ట మాత్రం రికార్డులు బద్దలుగొట్టేస్తోంది. అద్దె పెరుగుదలలో ఏకంగా ప్రపంచంలోనే 8వ స్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ దేశాల్లోనైతే పెరుగుదలలో పంజాగుట్టది రెండో స్థానం. హాంకాంగ్‌లోని సిమ్ షా సూయి తరవాతి స్థానం పంజాగుట్టదే!!. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాలు-2013’’ పేరిట రూపొందించిన నివేదికలో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఈ విషయాలు వెల్లడించింది. 2012తో పోలిస్తే పంజాగుట్టలో అద్దెల పెరుగుదల ఏకంగా 29.2 శాతం ఉందన్న సంస్థ వెల్లడించింది. పంజాగుట్టలో అద్దె ఒక చదరపు అడుగుకు సగటున రూ.155 పలుకుతోంది.
న్యూఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ 20 శాతం వృద్ధితో 17వ స్థానంలో నిలిచింది. ఖరీదైన రిటైల్ ప్రాంతాల జాబితాలో ప్రపంచంలో తొలి స్థానం హాంగ్‌కాంగ్‌లోని కాస్‌వే బే దక్కించుకుంది. ఇక్కడ చదరపు అడుగుకు అద్దె నెలకు సుమారు రూ.15,800. న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌ది 28వ స్థానం. ఈ మార్కెట్లో అద్దె రూ.1,250 ఉంది. కానీ గతేడాదితో పోల్చినపుడు కేవలం 2 శాతం వృద్ధిని నమోదు చేసింది.
పంజాగుట్టకు అంత గిరాకీ ఎందుకు?
హైదరాబాద్‌లో ప్రధాన బంగారు నగల దుకాణాలన్నీ పంజాగుట్టలోనే కొలువుదీరాయి. ఈ సంస్థలే అధికంగా అద్దె కోసం వెచ్చిస్తున్నట్లు సమాచారం. తాము చదరపు అడుగుకు రూ.200 దాకా చెల్లిస్తున్నట్టు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ నగలషాపు యజమాని చెప్పారు. పంజాగుట్ట నడిబొడ్డున హైదరాబాద్ సెంట్రల్ ఉండగా.. ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలోనే జీవీకే వన్, సిటీ సెంటర్, షాపర్స్ స్టాప్, ప్యాంటలూన్స్, లైఫ్ స్టైల్, బిగ్ బజార్, వెస్ట్‌సైడ్, సీఎంఆర్, కళానికేతన్, ఆర్‌ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, చెర్మాస్, కళామందిర్ తదితర 100కుపైగా ప్రధాన బ్రాండ్ల ఔట్‌లెట్లున్నాయి. తాజ్ బంజారా, తాజ్ కృష్ణా, తాజ్ డెక్కన్, ఐటీసీ కాకతీయ, గ్రీన్‌పార్క్, పార్క్ వంటి స్టార్ హోటళ్లూ ఈ ప్రాంతానికి హైలైట్. బ్యాంకులు, సినిమా హాల్స్‌కు కొదవ లేదు. ఇక్కడ వ్యాపారం ఉంది కాబట్టే అద్దె ఆ స్థాయిలో ఉందని ఒక వ్యాపారి వ్యాఖ్యానించారు.
రోజూ 2 లక్షల మంది..
పంజాగుట్టకు 2-3 కిలోమీటర్ల పరిధిలో రోజుకు 2 లక్షల పైచిలుకు కస్టమర్లు షాపింగ్ చేస్తున్నారని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ డెరైక్టర్ కలిశెట్టి నాయుడు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఈ ప్రాంతం బిలియన్ డాలర్ల మార్కెట్ అని, ఇక్కడ అన్నీ దొరుకుతాయని అన్నారాయన. కాగా, కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ 64 దేశాలకు చెందిన 334 షాపింగ్ ప్రాంతాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.