నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : స్వల్పలాభాలతో ప్రారంభమైన గురువారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే నాటికి నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 205.37 పాయింట్ల నష్టంతో 27,710 వద్ద, నిఫ్టీ 55.75 పాయింట్ల నష్టంతో 8,510 దగ్గర ముగిసింది. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పేయింట్స్, విప్రో టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. యాక్సిస్ బ్యాంకు, బీహెచ్ఈఎల్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎమ్ అడ్ ఎమ్ టాప్ లూజర్లుగా నష్టాల్లో గడించాయి.
కంపెనీలు ప్రకటిస్తున్న నిరాశజనకమైన తొలి త్రైమాసిక ఫలితాలు, బ్యాంకు స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకు నిఫ్టీ దాదాపు 1.5శాతం మేర నష్టపోయింది. యాక్సిస్ బ్యాంకు, ఎస్ బీఐలు 3-4శాతం మేర నష్టపోయాయి. మరోవైపు జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన అనంతరం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కూడా 1శాతం మేర నష్టపోయింది. లాభాల్లో అదరగొట్టినప్పటికీ, బ్యాంకుకు ఉన్న మొండిబకాయిల బెడదతో షేర్లు పతనమయ్యాయి.
కాగా, మార్కెట్ వాల్యుయేషన్ లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు నేటి మార్నింగ్ ట్రేడింగ్ లో ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరింది. రూ.107 లక్షల కోట్లగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ నమోదైంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 67.19గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో భారీగా నష్టోయిన పుత్తడి కొంత కోలుకొని, రూ.97 లాభంతో రూ.30,834గా నమోదైంది.