జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆదివారంతో ముగిసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీజేపీ నేత వసుంధర రాజె సహా 2087 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. చత్తీస్‌గఢ్ మాదిరిగానే ఇక్కడా రికార్డ్ స్థాయి పోలింగ్ జరగడం విశేషం. 199 స్థానాలకు జరిగినఎన్నికల్లో 74.38 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2003, 2008 ఎన్నికల్లో వరుసగా 68.18 శాతం, 66.49 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది.
బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో చురు స్థానంలో ఓటింగ్‌ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ తెలిపింది. దౌసా జిల్లాలోని సలీంపూర్‌లో పోలింగ్‌ను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. సికర్ జిల్లాలోని ఫతేపూర్‌లో సిబ్బందికోసం వినియోగించిన ఒక వ్యాన్‌ను దుండగులు తగలబెట్టారు. భరత్‌పూర్ జిల్లాలోని రూప్వాస్ ప్రాంతంలో పోలింగ్‌బూత్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడంతో పోలింగ్‌ను కాసేపు నిలిపేశారు. ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతో దుగ్ నియోజకవర్గం పరిధిలోని ఒక బూత్‌లో ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం.
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రూ. 12.89 కోట్ల నగదును, రూ. 29.1 కోట్ల విలువైన మద్యాన్ని, రూ. 5.49 కోట్ల విలువైన నార్కొటిక్ డ్రగ్స్‌ను, రూ. 5.68 కోట్ల విలువైన చీరలు తదితర బహుమతులను స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 31 పెయిడ్ న్యూస్ కేసులను నమోదు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.