ఆస్పత్రుల శుభ్రానికి గోమూత్రం
వృధాగా పోయే గోమూత్రంతో ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వాస్పత్రులు ముందుకొస్తున్నాయి. ఖరీదైన ఫినాయిల్‌ను పక్కన పడేసి గో మూత్రంతోనే ఆస్పత్రిలను శుభ్రం చేయిస్తామని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రి ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర రాథోర్ ప్రకటించారు. జలోర్ జిల్లాలోని పథ్మేడ గ్రామంలో ఏర్పాటు చేసిన గోమూత్రం రిపైనరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి రిఫైనరీని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఫినాయిల్ స్థానంలో గో మూత్రానికి వేపాకును కలిపి ఉపయోగించడం మంచిదని, దానివల్ల ఆవు పట్ల మనకున్న ఆరాధ్య భావన మరింత ఇనుమడిస్తుందని కేంద్రమంత్రి, జంతు కారుణ్య కార్యకర్త మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి శుచి, శుభ్రతల కోసం గో మూత్రాన్ని ఉపయోగించాలనే ఆలోచన ఆమెదే. గత మార్చి నెలలోనే ఆమె ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు.
పథ్మేడ గ్రామంలో రూ. 4 కోట్లతో గోమూత్రం రిఫైనరీ ప్లాంటును గోపాల్ గోవర్ధన్ గోశాల అనే సంస్థ ఏర్పాటుచేసింది. ఆవు పాలు, మూత్రాన్ని ఉపయోగించి తయారుచేసే ఉత్పత్తులను ఇక తాము విరివిగా మార్కెటింగ్ చేస్తామని రిఫైనరీ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైద్య శ్యామ్‌సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. రోజుకు 7 వేల లీటర్ల గోమూత్రాన్ని శుద్ధిచేసే సామర్థ్యం తమ రిఫైనరీకి ఉందని, వాటిలో సగభాగాన్ని శుభ్రత ఉత్పత్తుల కోసం, మిగతా సగ భాగాన్ని ఔషధాల కోసం ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. మధుమేహం, హృద్రోగుల ఔషధాల్లో గో మూత్రాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు.