
ఆ పాపం ఆప్‌దే: రాజ్‌నాథ్
రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య పాపం ఆమ్ ఆద్మీ పార్టీదేనంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శలు గుప్పించారు.
ఉరి సమయంలో కార్యకర్తలు, నేతలు రెచ్చగొట్టారు
న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య పాపం ఆమ్ ఆద్మీ పార్టీదేనంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. రైతు చెట్టెక్కి, ఉరి బిగించుకుంటున్న సమయంలో ఆప్ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతూ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. నినాదాలు చేయొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా వాళ్లు వినలేదన్నారు. గురువారం లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో రాజ్‌నాథ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘సాధారణంగా ఆత్మహత్యకు యత్నిస్తున్నవారి మనసు మార్చేందుకు వారితో తెలివిగా మాట్లాడతారు. ఆ వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమించుకునేలా చూస్తారు.
కానీ ఇక్కడ జరిగింది వేరు. కానీ అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. రెచ్చగొట్టారు..’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పోలీసులు చోద్యం చూశారన్న సభ్యుల విమర్శలను కూడా మంత్రి తోసిపుచ్చారు. రైతును కాపాడేందుకు పోలీసులు వారి వంతు ప్రయత్నం చేశారన్నారు. ‘‘వారు వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు.
ఆయనను కిందకు దింపేందుకు ఎత్తై నిచ్చెన తీసుకురావాలంటూ అగ్నిమాపక విభాగాన్ని సంప్రదించారు’’ అని వివరించారు. తాను అక్కడుంటే ర్యాలీని వెంటనే రద్దు చేసేవాడినంటూ ఆప్ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు అప్పగించమని చెప్పారు.