
మగబిడ్డే పుడతాడని నేను చెప్పలేదు
పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు
న్యూఢిల్లీ: పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన తన సంస్థకు చెందిన మగబిడ్డ మందుపై వివరణ ఇచ్చారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ పుట్టడానికి సంబంధమే లేదని అన్నారు. తనపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కొందరు ఇలా చేస్తున్నారని, బురద జల్లే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుత్ర జీవక్ మందు తింటే మగ బిడ్డనే జన్మిస్తాడని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. గురువారం జరిగిన రాజ్యసభ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ త్యాగి పుత్రజీవక్ మెడిసిన్ నిషేధించాలని, దాని ఉత్పత్తి దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు కూడా ఆయనకు తోడవడంతో ఈ విషయం రాజ్యసభలో దుమారం రేపింది.