
రాందేవ్ తమ్ముడిపై కిడ్నాప్ కేసు.. కుట్ర ఉందన్న బాబా
యోగా గురువు రాందేవ్ బాబా తమ్ముడు రాం భరత్పై ఉత్తరాఖండ్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆశ్రమానికి చెందిన ఓ మాజీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి తమ స్వాధీనంలో ఉంచుకున్నారంటూ ఈ కేసు నమోదు చేశారు. తన మనవడు నితిన్ త్యాగిని రాం భరత్ కిడ్నాప్ చేశాడంటూ సోమ్ దత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
రాందేవ్కు చెందిన పతంజలి యోగపీఠంలో నితిన్పై దాడి జరిగిందని కన్ఖల్ పోలీసు స్టేషన్ సీఐ చంద్రమోహన్ నేగి తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అని రాందేవ్ బాబా మండిపడ్డారు. తన పర్యటనల ద్వారా కాంగ్రెస్ పార్టీని తాను దెబ్బతీస్తున్నాననే ఇలా చేశారన్నారు. తన తమ్ముడు తప్పించుకుపోయే వ్యక్తి కాదని, పోలీసులు ఇంతవరకు అతడిని విచారణకే పిలవలేదని ఆయన అన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం తమ ఆశ్రమంలో రూ. 25 లక్షల విలువైన మిషన్ విడిభాగాలను త్యాగి దొంగిలించాడని రాందేవ్ ప్రతినిధి ఎస్కే తిజరావాలా తెలిపారు.