విదేశీ రుణ నిబంధనల సడలింపు
ముంబై: విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆర్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు విదేశీ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే నిబంధనలను సడలించింది. బ్యాంకులు ఈక్విటీ క్యాపిటల్‌లో 100 శాతం దాకా విదేశాల నుంచి రుణాలు తీసుకోవచ్చు. అయితే 10 మిలియన్ డాలర్ల దాకా గరిష్ట పరిమితి ఉంటుంది. అలాగే, డాలర్ మారకంలో విదేశీ రుణాల సమీకరణకు సంబంధించి బ్యాంకులు .. తనతో స్వాప్ లావాదేవీలు కుదుర్చుకునే విషయంలోనూ ఆర్‌బీఐ నిబంధనలు సడలించింది.
మరోవైపు, విదేశీ విద్యార్థులు..అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో (యూసీబీ) ఖాతాలు తెరవడానికి సంబంధించి కేవైసీ (ఖాతాదారుల వివరాల వెల్లడి) నిబంధనలు కూడా ఆర్‌బీఐ సరళతరం చేసింది. దీని ప్రకారం విద్యార్థుల పాస్‌పోర్టు, వీసాల ప్రాతిపదికన యూసీబీలు నాన్ రెసిడెంట్ ఆర్డినరి (ఎన్‌ఆర్‌వో) ఇవ్వొచ్చు. ఆ తర్వాత 30 రోజుల్లోగా సదరు విద్యార్థి స్థానికంగా తన చిరునామా ధృవీకరణ (రెంటల్ అగ్రిమెంట్ వంటివి) పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
కరెన్సీ నోట్లు, నాణేల పంపిణీకి బీసీల సేవలు
కరెన్సీ నోట్లకు డిమాండ్‌ను తట్టుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషించాల్సిందిగా బ్యాంకులకు భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సూచించింది. బ్యాంకు నోట్లు, నాణేలు పంపిణి చేయడానికి బిజినెస్ కరెస్పాండెంట్ల(బీసీ)ల సేవలను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని ఆరబీఐ కోరింది.