ముంబై: బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు దేశంలో రూ.3,500 కోట్లకు పైగా ఉంటాయి. డిపాజిటర్లను చైతన్యవంతుల్ని చేయడానికి ఈ సొమ్మును వినియోగించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం ప్రతిపాదించింది. బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా ఉంటూ ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్మును డిపాజిటర్ల విద్య, చైతన్య నిధి పథకానికి బదిలీ చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ మేరకు ఓ ముసాయిదా పత్రాన్ని రూపొందించి, వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది. ఓ అంచనా ప్రకారం... బ్యాంకుల్లో రూ.3,652 కోట్ల అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 15 శాతం భారతీయ స్టేట్ బ్యాంకులోనే ఉన్నాయి. డిపాజిటర్ల చైతన్య నిధికి బదిలీ చేసిన సొమ్మును మళ్లీ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. సంబంధిత బ్యాంకు ఆ ఖాతాదారునికి డబ్బు చెల్లించి, చైతన్య నిధి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ నిధిని 11 మంది సభ్యులు గల కమిటీ పర్యవేక్షిస్తుంది.
క్లెయిమ్‌కాని సొమ్ముతో డిపాజిటర్ల చైతన్య నిధి
Published Wed, Jan 22 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement