![ఎక్కడిరేట్లు అక్కడే!](/styles/webp/s3/article_images/2017/09/2/81428262010_625x300.jpg.webp?itok=7QSt5Kn4)
ఎక్కడిరేట్లు అక్కడే!
రేపు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష
పెరుగుతున్న ఆహార ధరలతో రేట్ల తగ్గింపునకు చాన్స్ లేనట్టే
బ్యాంకర్లు, విశ్లేషకుల అభిప్రాయం...
న్యూఢిల్లీ: ఎగబాకుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. వడ్డీరేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఆర్‌బీఐ రేపు(మంగళ వారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని బ్యాంకర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పలు చోట్ల ఇటీవలి అకాల వర్షాల కారణంగా ఆహార ధరలకు రెక్కలొస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ధరల తగ్గుముఖ ధోరణి కనబడితేనే మళ్లీ ఆర్‌బీఐ భవిష్యత్తు రేట్ల కోత సంకేతాలిస్తుందనేది వారి వాదన. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గత రెండు సార్లు కూడా(జనవరి 15న, మార్చి 4న) పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ఇంకా రుణ గ్రహీతలకు బదలాయించడానికి తటపటాయిస్తున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం చొప్పున కొనసాగుతున్నాయి.
సీఆర్‌ఆర్ తగ్గిస్తే మంచిది..: అరుంధతీ భట్టాచార్య
ఆర్‌బీఐ సమీక్షలో సీఆర్‌ఆర్‌ను తగ్గించాలని కోరుకుంటున్నట్లు దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దీనివల్ల బ్యాంకులకు నిధులపై వ్యయం తగ్గుముఖం పట్టి.. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు(రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు) అవకాశం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఆర్‌బీఐ రేపో రేటు తగ్గింపు చర్యలను బ్యాంకులు కూడా అనుసరించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుత ధరల స్థితిని చూస్తుంటే... మంగళవారంనాటి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యూనియన్ బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారి పేర్కొన్నారు. సీఆర్‌ఆర్‌ను తగ్గిస్తే.. బ్యాంకుల రుణ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతుందని ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం భాసిన్ చెప్పారు. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రుణ వితరణ చాలా మందకొడిగా ఉందని.. 2015-16 తొలి త్రైమాసికంలో కూడా ఇలాగే కొనసాగవచ్చని భాసిన్ పేర్కొన్నారు. మార్చి 20తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకుల రుణ వృద్ధి 9.5 శాతానికే పరిమితమైంది. రెండు దశాబ్దాల కాలంలో ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.
ఆర్థిక వేత్తలు ఏమంటున్నారంటే...
అకాల వర్షాల ప్రభావంతో రబీ సీజన్‌లోని గోధుమలు, నూనె గింజలు, పప్పులు తదితర పంటల దిగుబడులు 25-30% దెబ్బతినొచ్చని అసోచామ్ అంచనా వేస్తోంది. ఈ ప్రతికూల ప్రభావం కారణంగా ఆహారోత్పత్తుల ధరలు మరింత ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటంతో ఆర్‌బీఐ వేచిచూసే ధోరణి అవలంభిస్తుందని.. రేపటి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త జ్యోతిందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. అయితే, మరో పావు శాతం రెపో రేటు కోత గనుక ఈసారి సమీక్షలో ఉండకపోతే.. ఏప్రిల్‌లోనే పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రాజన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. మార్చి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడులైన తర్వాత ఈ చర్యలకు ఆస్కారం ఉందన్నారు.
తయారీకి ఊతమివ్వలేదు: ఫిక్కీ సర్వే
ఆర్‌బీఐ తాజా రేట్ల కోతలతో తయారీ రంగంలో పెట్టుబడులకు ఎలాంటి ఊతం లభించలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫిక్కీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రేట్ల కోత కారణంగా తమ కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగిన దాఖలాలేవీ లేవని సర్వేలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. తయారీ రంగ సంస్థలు ప్రస్తుతం బ్యాంకులకు 9.5-14.75 శాతం స్థాయిలో వడ్డీరేట్లను చెల్లిస్తున్నాయి. ఆర్‌బీఐ రేట్లు తగ్గించినా.. బ్యాంకులు ఇంకా ఆ ప్రయోజనాన్ని బదలాయించని విషయం విదితమే. కాగా, ప్రస్తుతం తమకు సగటున 12 శాతం పైబడిన వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయని 58 శాతం మంది తెలిపారు. వచ్చే మూడు నెలల కాలానికి తాము ఎలాంటి అదనపు నియామకాలూ చేపట్టలేదని 80 శాతం ప్రతినిధులు వెల్లడించారు. భూసేకరణ, నియంత్రణపరమైన ఇబ్బందులు, అధిక వడ్డీరేట్లు, అనుమతుల్లో జాప్యం వంటివి తయారీ రంగంలో విస్తరణ ప్రణాళికలకు ప్రధాన అడ్డంకులని సర్వే తెలిపింది.