ఆ ట్వీట్లు మళ్లీ వస్తాయి!
న్యూయార్క్: రాజకీయ నాయకులకు మింగుడు పడని వార్త. ట్విటర్ లో పోస్ట్ చేసి, తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి రానున్నాయి. ఈ మేరకు ట్విటర్ తో పొలిట్ వూప్స్ వెబ్ సైట్ ఒప్పందం కుదుర్చుకుంది.
తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగానే రాజకీయ నాయకులు వాటిని వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అసలు వారేమన్నారో ప్రజలకు తెలియకుండా పోతోంది. ఇలా తొలగించిన ట్వీట్లను పొలిట్ వూప్స్ ద్వారా తిరిగి పొందవచ్చు. భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా 30 దేశాల్లో ఈ సేవలను మళ్లీ ప్రారంభించనుందని సీనెట్ డాట్ కామ్ వెల్లడించింది. అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్ నడుపుతున్న పొలిట్ వూప్స్ వైబ్ సైట్ ను నెదర్లాండ్ కు చెందిన పారదర్శక సంస్థ ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.
పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు అందించింది. అయితే తొలగించిన ట్వీట్లకు సంబంధించిన కోడ్ ఇచ్చేందుకు ట్విటర్ నిరాకరించడంతో గతేదాడి నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా తాము జరిపిన చర్చలు ఫలించడంతో మరోసారి ఈ సేవలు ప్రారంభించనున్నామని ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. అయితే ట్విటర్ లో తొలగించిన ట్వీట్లను తిరిగి పోస్ట్ చేస్తుందా అనేది స్పష్టం కాలేదు.