కొనసాగుతున‍్న రిలయన్స్ దూకుడు
ముంబై: జియో సేవల ఎంట్రీతో తన పూర్వ వైభవాన్ని సంతరించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవాను కొనసాగిస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచీ జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకోనుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ దూకుడుగా ఉంది. తాజాగా ఆర్ ఐఎల్ షేరు ధర రూ .1300 మార్క్‌ని దాటి మరోసారి 52 వారాల గరిష్ఠానికి చేరింది. గత వారమే 9ఏళ్ల గరిష్టాన్ని తాకిన 3.5 శాతానిపై పైగా లాభపడుతోంది.
గత వారం, పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ షేరుకు రూ 1,506 టార్గెట్‌ను నిర్దేశించింది. మయాంక్ మహేశ్వరీ, రాకేష్ సేథియా, అమృతా పబాల్కర్ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు ఆర్ ఐ ఎల్ మరింత దూసుకుపోనుందని అంచనావేశారు. అటు విదేశీ బ్రోకింగ్ సంస్థలు సీఎల్‌ఎస్‌ఏ, బీవోఎఫ్‌ఏ-ఎంఎల్ ఏడాది కాలానికి ఆర్‌ఐఎల్ షేరు టార్గెట్ ధరను వరుసగా రూ. 1,500, 1375గా అంచనా వేయగా.. క్రెడిట్‌స్వీస్ సైతం షేరు టార్గెట్ ధరను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ పాజిటివ్ అంచనాల నేపథ్యంలో కొత్త టార్గెట్ ను చేధించే దిశగా పరుగులు తీస్తోంది.
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 4.22 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా అత్యంత విలువైన మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలలో టీసీఎస్ తదుపరి స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీసీఎస్ రూ. 4.87 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 21, 2017 నాటి ప్రకటన కంపెనీ షేర్లు కేవలం రెండు వారాల్లో దాదాపు 30శాతం రాబడిని సాధించడం విశేషం.