మరో సంచలనానికి సిద్ధమవుతున‍్న జియో
సియోల్: అరంగేట్రంతోనే సంచలనం సృష్టించి ఇతర నెట్ వర్క్ లకు కోలుకోలేని దెబ్బ తీసిన రిలయన్స్ జియో.. మరో సంచలనాకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉచిత డేటా, కాలింగ్ తదితర ఆఫర్లతో రికార్డ్ స్థాయిలో వినియోగదారులను సొంతంచేసుకున్న జియో.. తాజాగా మరోమారు ఇతర కంపెనీలను దెబ్బ కొట్టే వ్యూహంతో పావులు కదుపుతోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు జియో మరో ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తో జతకట్టింది. మొబైల్ వరల్డ్ 2017 సమావేశంలోని ఒక క్లోజ్డ్ ఈవెంట్ లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో శాంసంగ్ 5జీ సేవల హోం రౌటర్, రేడియో బేస్ స్టేషన, 5 జీ మోడం చిప్ సెట్‌లను ఇదే సమాశాల్లో లాంచ్ చేయడం విశేషం.
గతవారం వెల్లడించిన ప్రైమ్ మెంబర్ షిప్ పథకం ప్రకారం కొత్త జియో వినియోగదారులకు త్వరలో 5జీ సేవలను అందించేందుకు సమాయత్తమవుతోంది. ముఖ్యంగా హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ త్వరలోను ముగియనుండంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త తారిఫ్ లను అమలు చేయనుంది. తన ప్రైమ్ యూజర్లకు అన్ లిమిటెడ్ ప్రయోజనాలు మార్చి 31, 2018 వరకూ అందించేలా కొత్త ప్రోత్సాహకాలను అందించనున్నామని రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించారు. ఈ క్రమంలో జియోటీవీ, జియో మ్యూజిక్, జియో మాగ్స్, జియో సినిమా, జియోఎక్స్ ప్రెస్ లాంటి మీడియా సేవలను అందించనుంది. అంతేకాదు 5 జీ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. మరోవైపు నోకియా ఇప్పటికే 5 జీ సేవలపై దృష్టిపెట్టింది. ఈ మేరకు స్పెయిన్ బార్సిలోనా సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
కాగా 5జీ సర్వీసులతోపాటు జియో టీవీ అనే కొత్త సర్వీస్ ను కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ డీటీహెచ్ సర్వీస్ ద్వారా అతి తక్కువ ధరతో 360కి పైగా చానల్స్ ను చూడవచ్చని గతంలో రిలయన్స్ పేర్కొంది. అయితే ఈ సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభ మవుతుందన్నవిషయాన్ని స్పష్టంచేయనప్పటికీ నార్మల్ టీవీనుంచి స్మార్ట్ టీవీకిమారేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.