- రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నవారిలో బైక్ రైడర్లే ఎక్కువ
- గత ఏడాదిలో 52,500 మంది మృత్యువాత
- 2016లో మొత్తం 4.8 లక్షల ప్రమాదాల్లో 1.5 లక్షల మంది దుర్మరణం
- అత్యధిక మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ
- ‘2016లో ప్రమాదాలు’పై రిపోర్ట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- 2017 ప్రధమార్ధంలో తగ్గిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారు. అన్ని రాష్ట్రాల పోలీసు శాఖల నుంచి సేకరించిన వివరాల ప్రకారం గత ఏడాది(2016) భారత్‌లో మొత్తం 4,80,652 రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా.. 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య 4,94,624గా నమోదయింది. చనిపోయినవారిలో 52,500 మంది(33.8శాతం) ద్విచక్రవినియోగదారులే కావడం గమనార్హం.
అత్యధిక ప్రమాదాలు, మరణాలు సంభివిస్తోన్న రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉండటం గమనార్హం. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం విడుదల చేసిన ‘ఇండియాలో రోడ్డు ప్రమాదాలు-2016’ నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు.
‘రోడ్డు ప్రమాదాలు నివేదిక’లో మరికొన్ని అంశాలివి..
⇒ 2015తో పోల్చుకుంటే 2016లో రోడ్డు ప్రమాదాలు 4.1 శాతం తగ్గినప్పటికీ, మరణాలు 3.2 శాతం మేరకు పెరిగాయని నివేదికలో వెల్లడైంది.
⇒అయితే ఈ ఏడాది(2017) ప్రధమార్థంలో మాత్రం ప్రమాదాలు 3 శాతం తగ్గాయి. అదేవిధంగా 4.75 శాతం మేరకు మరణాలు కూడా తగ్గాయి.
⇒ అత్యధికంగా ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు: టూవీలర్లు(33.8 శాతం), కార్లు(23.6), ట్రాక్టర్లు, లారీలు,టెంపోలు(21శాతం), ఆటోరిక్షాలు(6.5 శాతం).
⇒ అతి వేగం.. దేశంలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణం. గత ఏడాది సంభవించిన మరణాల్లో 56 శాతం మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు.
⇒12 శాతం మరణాలు వాహనం నడుపుతూ మొబైల్ మాట్లాడటం వల్ల జరిగాయి. ఓవర్ టేకింగ్ వల్ల 6శాతం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 4 శాతం, ఇతర కాణాల వల్ల మరో 22 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
⇒ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది చోటుచేసుకున్న 22,811 ప్రమాదాల్లో 7,219 మంది ప్రాణాలు కోల్పోగా, 24,217 మంది గాయపడ్డారు.
⇒తెలంగాణలో 24,888 ప్రమాదాల్లో 8,541మంది చనిపోగా, 30,051 మంది గాయపడ్డారు.
⇒రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 18-34 ఏళ్ల వయసు వారే ఎక్కువ(46.3 శాతం)
⇒జరుగుతోన్న ప్రమాదాల్లో జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్నవే (29.6 శాతం) అధికం. స్టేట్ హైవేలపై 25.3 శాతం, ఇతర రహదారులపై 45.1 శాతం.
⇒ఎక్కువగా ప్రమాదానికి గురవుతోన్నవారిలో ద్విచక్రవాహనదారుల సంఖ్య (52,500) ఎక్కువ. వీరిలో 19.3 శాతం మంది ప్రమాద సమయంలో హెల్మెట్లు ధరించనివారే. కారు వినియోగదారులు 26,923 మంది చనిపోగా, భారీ వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై చనిపోయివారి సంఖ్య 26,845గా ఉంది.
⇒పాదచారులూ జాగ్రత్త: గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 15,746 మంది పాదచారులు చనిపోవడం గమనార్హం.
⇒అత్యధికంగా ప్రమాదాలు జరుగుతోన్న పెద్ద నగరాల్లో చెన్నైది మొదటి స్థానం. గతేడాది చెన్నైలో 7,486 ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(7375 ప్రమాదాలు), బెంగళూరు(5323), ఇండోర్(5143), కోల్‌కతా(4104), ముంబై(3379) ఉన్నాయి.
⇒ భారీ సంఖ్యలో జరుగుతోన్న ప్రమాదాలు.. దేశంలో రోడ్డు భద్రత ఆశించినమేరలో లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయని, సాంకేతికత సహాయంతో ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి గడ్కరీ తెలిపారు.
⇒ బ్లాక్‌స్పాట్స్(ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను) గుర్తించి, మార్పులు చేసేలా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీల సారధ్యంలో స్థానిక అధికారులు, పౌరులతో కూడిన కమిటీలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.