
హోలీ అంటే.. ఆ చిన్నారికి ఇక భయమే !
పిల్లల్ని, పెద్దల్ని ఒక్కటి చేసి ఆడుకునే పండగ హోలీ. ఆ హోలీ పండగ అనగానే ఐదేళ్ల వయస్సు ప్రభాత్ చౌహన్కు గతంలో ఉన్న ఊపు ఉత్సాహం ఇకపై ఉండదేమో.
లక్నో: పిల్లల్ని, పెద్దల్ని ఒక్కటి చేసి ఆడుకునే పండగ హోలీ. ఆ హోలీ పండగ అనగానే ఐదేళ్ల వయస్సు ప్రభాత్ చౌహన్కు గతంలో ఉన్న ఊపు ఉత్సాహం ఇకపై ఉండదేమో. ఎందుకంటే శుక్రవారం హోలీ వేడుకల సందర్బంగా అతడి జీవితంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. హోలీ పండగ నేపథ్యంలో చిన్నారి చేతి నిండా రంగులు తీసుకుని తల్లిదండ్రులపై చల్లేందుకు వేగంగా పరిగెత్తాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ప్రభాత్ కుడివైపు ఛాతీ భాగంలోకి దూసుకువెళ్లింది. దాంతో హాతాశులైన అతడి తల్లిదండ్రులు వెంటనే ఫజియాబాద్లోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లా కుడీబర్లో చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యులు అనేక గంటలు కష్టపడి అతడి ఛాతీ భాగంలోని ఐరన్ రాడ్ను తొలిగించారు. అనంతరం ప్రభాత్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. ప్రభాత్ ఉపిరితిత్తులకు ఐరన్ రాడ్ గుచ్చుకోలేదని... దీంతో అతడికి పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు.