
'రాష్ట్ర ముఖచిత్రం మారడం ఖాయం'
దేశచరిత్రలో ఎన్నదగిన రీతిలో రూ. 1.25 లక్షల కోట్ల భారీ ప్రత్యేక ప్యాకేజీని బీహార్ రాష్ట్రానికి ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఆరా: మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నవేళ ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రానికి దేశచరిత్రలో ఎన్నదగిన రీతిలో రూ. 1.25 లక్షల కోట్ల భారీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం మద్యాహ్నం భోజ్పూర్ జిల్లా కేంద్రం ఆరాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాజధాని పాట్నా నుంచి బక్సర్ ప్రాంతానికి నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
'స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ కున్వార్ సింగ్ పుట్టిన గడ్డ (ఆరా) మీద నిలబడి మాట్లాడటం ఆనందంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నేను మీకో వాగ్ధానం చేశా. మీ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పా. కానీ ఇప్పుడు చెప్పినదానికంటే ఎక్కువే చేస్తున్నా. కొత్తగా మరో రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తున్నా' అని చెప్పగానే జనం హర్షధ్వానాలు చేశారు.
గత నెలలో ప్రకటించిన రూ. 40 వేల కోట్ల ప్యాకీజీకి ఇది అదనమని, బీహార్ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తాజా ప్యాకేజీతో బీహార్ రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని మోదీ పేర్కొన్నారు. పక్షం రోజుల కిందట ఇదే బీహార్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో మొత్తం ప్యాకేజీ విలువ రూ 1.65 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ప్రధాని రాక సందర్భంగా ఆరా ప్రాంతంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించడం గమనార్హం.