
ఆరెస్సెస్‌పై దిగ్విజయ్ తీవ్ర ఆరోపణలు!
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
పనాజీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరెస్సెస్ అన్‌రిజిస్టర్డ్ (నమోదుకాని) సంస్థ అని, దానికి ప్రభుత్వం గుర్తింపు లేదని విమర్శించారు. ప్రతి ఏడాది ముఖ్యంగా ‘గురుపూర్ణిమ’ సందర్భంగా వసూలు చేసే నిధుల వివరాలను ఆరెస్సెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
‘నమోదుకాని సంస్థను నిషేధించే ప్రసక్తే ఉండదు. ఆరెస్సెస్‌పై నిషేధం విధించాలని మీరు చాలాసార్లు డిమాండ్లు చేశారు. కానీ, మీకు తెలుసు ఆరెస్సెస్ అన్‌రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్’ అని దిగ్విజయ్ విలేకరులతో పేర్కొన్నారు. ‘గురుపూర్ణిమ సందర్భంగా ఆరెస్సెస్ భారీగా నిధులు వసూలు చేస్తుంది. ఆరెస్సెస్‌కు గురుదక్షిణ కింద ఇలా ఎంతమొత్తం డబ్బు వస్తుంది? వీటికి ఖాతాలు ఉన్నాయా?’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఆరెస్సెస్ అన్‌రిజిస్టర్డ్ సంస్థ కావడంతో అది చట్టం పరిధిలోకి రాదని, కాబట్టి తనకు అందుతున్న డబ్బును ఏం చేస్తుందో ఆరెస్సెస్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.