
ఇక మూడో ప్రపంచ యుద్ధమే.. సై అంటున్న దేశం!
మరో ప్రపంచయుద్ధానికి రష్యా సన్నద్ధమవుతున్నదా? ఇందులో భాగంగా ఆ దేశం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నదా? అంటే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టాబ్లాయిడ్ ‘ద సన్’ ఔననే అంటున్నది. అంతర్జాతీయ యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే స్వదేశం చేరుకోవాలని రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు ‘ద సన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. మరో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశముండటంతో ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిపింది. నాలుగు కోట్ల మంది పౌరులకు రక్షణ కల్పించేరీతిలో రష్యా ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించింది. పూర్తిస్థాయిలో అణ్వాయుధ యుద్ధం వస్తే దానిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగానే ఈ విన్యాసాలు చేసినట్టు ఆ పత్రిక వివరించింది.
సాధ్యమైనంత త్వరగా రష్యా అధికారులు, వారి పిల్లలు, బంధువులు స్వదేశం చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపింది. అంతేకాకుండా రష్యా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు కూడా ఈ విషయంలో అధ్యక్షుడు పుతిన్ నుంచి అత్యున్నత స్థాయి హెచ్చరికలు అందినట్టు తెలిపింది. స్వదేశానికి తిరిగి రావాలన్న పుతిన్ పిలుపు ప్రభుత్వాధికారులందరికీ వర్తిస్తుందని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ అకస్మాత్తుగా ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ పిలుపు ఇవ్వడం గమనార్హం అని మరో బ్రిటన్ పత్రిక డెయిలీ స్టార్ పేర్కొంది. ఈ ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని, వారి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ప్రభుత్వం హెచ్చరించినట్టు తెలిపింది.
ఉన్నపళంగా విదేశాల్లోని రష్యాన్‌లందరినీ తిరిగి స్వదేశానికి రమ్మనడం దేనికి సంకేతం అంటే ఇవన్ని యుద్ధ సంకేతాలేనని, పెద్ద యుద్ధాన్ని చేసేందుకు సన్నహాకాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్‌కోవ్‌స్కీ పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ఇటీవలికాలంలో దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిరియా విషయంలో రష్యా-అమెరికా బాహాబాహీకి దిగుతున్నాయి. సిరియాలో శాంతికోసం తలపెట్టిన చర్చల ప్రక్రియ నుంచి అమెరికా తప్పుకోవడమే కాకుండా తమ దేశ వెబ్‌సైట్లను రష్యా హ్యాకింగ్ చేస్తున్నదని ఆరోపించిన సంగతి తెలిసిందే.