పశ్చిమదేశాలకు పుతిన్ హెచ్చరిక
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు.
చర్చలకు సదా సిద్ధం
ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్‌ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
2030 దాకా అధ్యక్ష పీఠంపై
రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి.
నవాల్నీని వదిలేద్దామనుకున్నాం..
దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment