ఒక్క‘హోదా’పై పది నాల్కలా? | sakshi special story of ap special status | Sakshi
Sakshi News home page

ఒక్క‘హోదా’పై పది నాల్కలా?

Published Fri, Aug 14 2015 2:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఒక్క‘హోదా’పై పది నాల్కలా? - Sakshi

ఒక్క‘హోదా’పై పది నాల్కలా?

ప్రత్యేక హోదా.. పదిహేను మాసాలుగా విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరీక్షిస్తున్న ఒక వాగ్దానం. పవిత్రమైన పార్లమెంట్ భవనంలో నిశిరాత్రి దాకా చర్చించి దీపాలు ఆర్పేసి, తలుపులు మూసేసి విభజన చట్టాన్ని ఆమోదించినప్పుడు.. విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య అవకాశాలన్నింటినీ తనలోనే కేంద్రీకరించుకున్న ఒక మహా రాజధానిని కోల్పోయి శిరస్సు తెగిపడిన దేహంలా నిస్సహాయురాలిగా ఈ రాష్ట్రం నిలబడినప్పుడు.. సాక్షాత్తూ నాటి ప్రధానమంత్రి చేసిన ప్రకటన. అప్పటి ప్రతిపక్షమైన నేటి పాలకపక్షం ఎలుగెత్తి అడిగిన కోరిక.

ఆ ఒక్క ప్రత్యేక హోదాపై నేడెందుకు పది రకాల నాల్కలు పలు విధాలుగా నాట్యం చేస్తున్నాయ్? ఆకుకు అందని పోకకు పొందని సమాధానాలు ఎందుకు ముందుకు వస్తున్నాయ్? కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను ఆదా యాన్ని పంపకం చేసే ఆర్థిక సంఘానికీ-ప్రత్యేక హోదాకు ఏమిటి సంబంధం? ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ ఏమైంది? దాని మాతృసంస్థ ఆర్థికశాఖ ఏమైంది? ఎన్డీసీ ఏమైంది? మధ్యలో ఈ ఆర్థిక సంఘం తడికె ఎక్కడిది? హోదా ఉన్న రాష్ట్రాలకు నిధులేమీ ఎక్కువగా రాలేదంటూ మన ముఖ్యమంత్రి నాలుక ఎందుకు మడత పడుతోంది? అసలు మతలబు ఏమిటి?.... ప్రత్యేక హోదాపై ‘సాక్షి’ విశేష కథనం.

 
ఇస్తాం... పరిశీలిస్తాం... సాధ్యం కాదు!
పూటకోమాటతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న కేంద్రం
ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని లోక్‌సభలో స్పష్టీకరణ
జనరల్ కేటగిరీ, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదన్న 14వ ఆర్థికసంఘం
ప్రత్యేక కేటాయింపులు లేకుండా ప్రత్యేకహోదా కొనసాగింపుపై కొరవడిన స్పష్టత
నిజానికి ఆర్థిక సంఘం పరిధిలో లేని ప్రత్యేక హోదా
నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌డీసీ
అయినా 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల సాకుతో దోబూచులాట
కీలకమైన అంశంపై చంద్రబాబు రోజుకోమాట
ఓటుకు కోట్లు కేసు భయంతోనే కేంద్రానికి వంతపాడుతున్న బాబు
హోదాతోనే 90 శాతం గ్రాంటు, పరిశ్రమలకు రాయితీలు
ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటే ఆ ప్రయోజనాలేవీ వర్తించవు
ఈ విషయం దాచిపెట్టి మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా మాతోనే సాధ్యం... మేం అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం... అంటూ ఎన్నికల ముందు ఊరూరా ఊదరగొట్టి ప్రజలను నమ్మించి అధికారపీఠం ఎక్కిన తెలుగుదేశంపార్టీ, భారతీయ జనతాపార్టీ నిజస్వరూపాలు నెమ్మదిగా బట్టబయలవుతున్నాయి. రాష్ట్రవిభజన నేపథ్యంలో రాజధానిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రత్యేకహోదా ఇవ్వడం ద్వారా సరిదిద్దుతామని అప్పటి పాలక కాంగ్రెస్‌పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేకహోదా అంశం పరిశీలనలో ఉందనీ, ఇస్తామనీ 15 నెలలుగా పూటకో మాటతో మభ్యపెడుతూ వచ్చింది. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రత్యేకహోదా అంశం ప్రస్తావనకు రాగానేకేంద్రంలోని బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు 14వ ఆర్థికసంఘం ప్రత్యేకహోదాకు సిఫారసు చేయలేదని నాటకాలాడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులతో ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ప్రణాళికా శాఖ సహాయ మంత్రి ఇందర్‌జీత్‌సింగ్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం పరిశీలిస్తే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ విధానం స్పష్టంగా అర్థమవుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదాను ఉపసంహరించుకునే ఆలోచనేదీ లేదని అందులో స్పష్టంగా చెప్పారు. అయితే ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపులో ఆర్థికసంఘం ఎలాంటి తేడా చూపలేదని పేర్కొన్నారు. ప్రత్యేక కేటాయింపులు లేనప్పుడు ఈశాన్యరాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగించడం ఆచరణలో ఎలా సాధ్యం? అంటే ప్రత్యేకహోదా ఉందంటూనే ప్రత్యేక కేటాయింపులు లేవంటూ ఒకే ప్రశ్నకు విరుద్ధ సమాధానాలివ్వడంతో కేంద్రం ద్వంద్వవైఖరి స్పష్టమవుతోంది.
 
ఆర్థికసంఘం పరిధిలోనిదేనా?
ఆర్థిక సంఘం సిఫార్సు చేయకపోవడంవల్లనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నామని ఇన్నాళ్లూ కేంద్రం, కేంద్ర మంత్రులూ చెబుతూ వచ్చారు. అయితే ఏ రాష్ట్రానికైనా కొత్తగా ప్రత్యేకహోదా ఇవ్వాలని 12వ ఆర్థికసంఘం ఎలాంటి సిఫార్సులూ చేయలేదని వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు రాష్ట్రాలకు వాటా కేటాయింపుల్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ కలిగిన రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం లేదని పేర్కొన్నారు. అంటే రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే అధికారం ఆర్థికసంఘానికి లేదని, కేవలం నిధుల కేటాయింపు మాత్రమే దాని పరిధి అని పరోక్షంగా మంత్రి అంగీకరించారు.

కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు మాత్రం 14వ ఆర్థిక సంఘం అడ్డుపడటంవల్లనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నామంటూ పక్కదారి పట్టిస్తున్నారు. అయితే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వమని, ఇవ్వద్దని సిఫారసు చేసే అధికారం ఆర్థిక సంఘానికి లేదు. కేంద్రానికి పన్నుల ద్వారా సమకూరే ఆర్జనను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలనే అంశాలను సూచించడమే ఆర్థిక సంఘం పని. ప్రణాళికేతర గ్రాంట్లు, రుణాలు ఎలా ఇవ్వాలో సిఫారసు చేస్తుందే తప్ప, ప్రణాళికా వ్యయంలో ఉన్న లోటు గురించి, ప్రణాళికా గ్రాంట్లు గురించి ఎలాంటి సిఫారసులు చేయదు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సాధారణ సాయం, ప్రత్యేక సాయం గురించి ఆర్ధిక సంఘాలు ఎలాంటి సిఫారసులు, సూచనలు చేయవు. ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపించడం గతంలో ఆర్థిక సంఘాలు చేయలేదు. ప్రత్యేక హోదా కల్పన మీద నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన మంత్రి నేతృత్వంలోని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)కే పూర్తి అధికారాలున్నాయి. అయినప్పటికీ ఆ నెపాన్ని 14వ ఆర్థిక సంఘం మీద నెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీలో ప్రత్యేకహోదాపై నిర్వహించిన ధర్నాలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా గుర్తుచేశారు.
 
పూటకో మాటతో చంద్రబాబు మోసం
ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు ప్రత్యేకహోదాపై రోజుకో మాట మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దాటవేత ధోరణికి వంతపాడుతున్నారు. త్వరలోనే ప్రత్యేకహోదా వస్తుందంటూ కేంద్రమంత్రి సుజనాచౌదరి పలుమార్లు గడువులు చెప్పి మభ్యపెట్టగా... ప్రత్యేకహోదా వల్లనే అన్నీ రావంటూ సీఎం ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏపీకి ప్రత్యేకహోదా రాదని చంద్రబాబుకు కూడా తెలుసుననీ, కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు మాట్లాడుతున్నారనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేకహోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనీ, దాన్ని సాధించడం తమకే సాధ్యమనీ, అందుకే తమకు ఓటు వేసి గెలిపించాలనీ ఎన్నికల ముందు పదే పదే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతూ... ప్రత్యేకహోదా వస్తే అన్నీ వచ్చేస్తాయని కొందరు మభ్యపెడుతున్నారని మాట్లాడటం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రప్రభుత్వంలోని తన పార్టీ మంత్రులను ఉపసంహరించుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ దిశగా ఎలాంటి ఆలోచనా చేయడంలేదు.

ఓటుకు కోట్లు కేసులో కూరుకుపోవడంవల్లనే చంద్రబాబు ప్రత్యేకహోదాపై పట్టుపట్టలేకపోతున్నారని, ప్రత్యేకహోదా అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తే ఎక్కడ తనపై కేసులు పెడతారోనన్న భయంతో, తన స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో పోరాటమంటూ కొత్త నాటకానికి తెరతీసింది. కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కానీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకానీ పార్లమెంటులో ఒక్కరోజుకూడా ఏపీ ప్రత్యేకహోదా గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
 
ప్రత్యేక హోదా ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్ విభజనవల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో నష్టం జరిగిందన్న విషయం అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం పెద్ద సవాలుగా మారుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి వీలుంది. పరిశ్రమలు వస్తే తప్ప నిరుద్యోగులకు ఉపాధి పెరిగే అవకాశాలుండవు. ప్రత్యేక హోదా దక్కితే ప్రయోజనాలేముంటాయంటే...
 
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో హోదా లేని రాష్ట్రాలకు 30 శాతం నిధులను గ్రాంట్‌గా ఇస్తుంది. అదే ప్రత్యేక హోదా లభించిన రాష్ట్రాలకైతే 90 శాతం గ్రాంటుగా (తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు) లభిస్తుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం ఆ 10 శాతం నిధులను కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉంటే దాన్ని కూడా కేంద్రం రుణం రూపంలో సమకూర్చుతుంది. ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఏపీకి ఇదెంతో అవసరం.
 
హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించేవారికి 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఆ రకంగా చాలామంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
 
ప్రత్యేక హోదా ఉంటే 100 శాతం కార్పొరేట్ ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అలాగే 30 శాతం వరకు పెట్టుబడి ప్రోత్సాహకాలు అందుతాయి. పరిశ్రమలు నెలకొల్పడానికయ్యే వర్కింగ్ కేపిటల్ కోసం తీసుకున్న రుణాలపై వడ్డీలో మూడు శాతం రాయితీ ఉంటుంది. పరిశ్రమలకు 20 సంవత్సరాలపాటు విద్యుత్ చార్జీల్లో 50 శాతం రాయితీ దక్కుతుంది. వీటితో పాటు ఇన్సూరెన్స్, రవాణా రంగాల్లో కూడా కేంద్రం రాయితీలు ఇస్తుంది. ఇవన్నీ లభిస్తే పరిశ్రమలు స్థాపించడానికి క్యూ కడతాయి.
 
ఇవన్నీ ప్రత్యేక హోదా వల్లే లభిస్తాయన్న సంగతి విస్మరించరాదు. ప్రత్యేక హోదా కాకుండా ప్రభుత్వం చెబుతున్నట్టు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలేవీ వర్తించవన్న విషయం గమనించాలి.
 
హోదాతో అన్నీ రావన్న బాబు
ప్రత్యేకహోదా వల్ల అన్నీ రావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో (12 వ తేదీ) బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. హోదా వస్తే అన్నీ వచ్చేస్తాయని కొందరు మభ్యపెడుతున్నారని ప్రతిపక్షంపై పెదవి విరిచారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుంది? అది ఉన్న రాష్ట్రాలకు ఇప్పటివరకు ఎన్ని నిధులొచ్చాయన్న విషయాలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరముందని రుసరుసలాడారు. పైగా ఈ అంశంపై వివరణ పత్రాలు విడుదల చేసి ప్రజల్లో చర్చకు పెడతామన్నారు. అంతకుముందు అమరావతి భూమి పూజ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ కోరుతున్నామని చెప్పారు.ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉపసంహరించాలన్న ప్రతిపాదన ఏదీ లేదంటూనే నిధుల కేటాయింపుల్లో ప్రత్యేక, జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని 14వ ఆర్థికసంఘం సిఫారసులను ప్రస్తావించిన కేంద్రమంత్రి ఇందర్‌జిత్ సింగ్ సమాధానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement