మన్మోహన్ సింగ్.. మీకిది తగునా?
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వెనుకేసుకురావడాన్ని కాంగ్రెస్ నేతలు ఆక్షేపిస్తున్నారు. మన్మోహన్ తీరును మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ తప్పుబట్టారు. ఆర్బీఐ గవర్నర్ ను మన్మోహన్ వెనకేసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ఆర్బీఐని ప్రశ్నించే అధికారం పార్లమెంట్ కమిటీలకు ఉంటుందని చెప్పారు.
‘మన్మోహన్ సింగ్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆర్బీఐ గవర్నర్ ను ఆయన వెనకేసుకురావడం సమంజసం కాదు. ప్రశ్నించే హక్కు ఎంపీలకు ఉంది. చట్టసభ సభ్యులకు ప్రశ్నించే హక్కు లేదని అనుకుంటే.. అవతలివారి నుంచి అటువంటి సమాధానాలే వస్తాయి. ఆర్బీఐ లాంటి సంస్థలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిందే’నని సందీప్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. పాత పెద్ద నోట్ల రద్దుపై వివరణ ఇచ్చేందుకు బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఉర్జిత్ పటేల్ కు మన్మోహన్ సింగ్ దన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయనను వెనకేసుకొచ్చారు.