
'ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్..'
ఒకే సమయంలో ఇద్దరు హీరోయిన్లతో మీరు సంబంధం పెట్టుకున్నారా? అని ప్రశ్నిస్తే.. ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో ఒకే సమయంలో ప్రేమలో మునిగిపోయినట్టు..
సాక్షి, ముంబై: బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ జీవితం చాలావరకు వివాదాలమయం. అలనాటి సినీ అగ్ర దంపతులైన సునీల్ దత్-నర్గీస్‌ల తనయుడైన సంజయ్ ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు వివాదాల్లో కూరుకుపోయాడు. డ్రగ్స్, ఎఫైర్లు, అక్రమ ఆయుధాల కేసు.. ఇవన్నీ మున్నాభాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. జైలు శిక్ష నుంచి కొన్నాళ్ల కిందట విముక్తి పొందిన సంజయ్ త్వరలో మళ్లీ సినిమాలతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. తాజాగా ఆయన 'ఇండియా టుడే మైండ్ రాక్స్-2017' కార్యక్రమంలో మాట్లాడుతూ తన ఎఫైర్ల గురించి నిర్మోహమాటంగా వెల్లడించాడు.
యవ్వనప్రాయంలో ప్లేబాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంజయ్ దత్ పలువురు నటీమణులతో ఎఫైర్లు పెట్టుకున్నట్టు కథనాలు వచ్చాయి. తన ఎఫైర్ల గురించి ప్రస్తావిస్తూ.. ఒకే సమయంలో ఇద్దరు హీరోయిన్లతో మీరు సంబంధం పెట్టుకున్నారా? అని ప్రశ్నిస్తే.. ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో ఒకే సమయంలో ప్రేమలో మునిగిపోయినట్టు సంజూ భాయ్ చెప్పుకొచ్చాడు. మరీ ముగ్గురికి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారంటే.. 'ఇందుకు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా వ్యవహరించాలి' అని చమత్కరించాడు. ప్లేబాయ్ ఇమేజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'ప్రజలతో ప్రేమించబడటం బాగుంటుంది. ముఖ్యంగా లేడీస్..' అని అన్నాడు.