
జానెడంత స్థలంలో బోలెడంత పంట
వ్యవసాయంలో విపరీతమైన కష్టాలున్నాయి.. లాభాలు అంతంతమాత్రమే.. నిజమే. అయితే ఇది నేలను నమ్ముకుని చేసే వ్యవసాయం. ఇప్పుడు ట్రెండ్ మారిపోతోంది. నిటారు సాగు (వర్టికల్ ఫార్మింగ్)కు ఆదరణ పెరిగిపోతోంది. జానెడంత స్థలంలోనే బోలెడంత పంట పండించేందుకు ఇదే మేలని ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం చైనా కూడా బలంగా నమ్ముతోంది. రుజువు కావాలా? పక్క ఫొటోల్లో ఉన్నది అదే. వంద హెక్టార్లు అంటే... సుమారుగా 250 ఎకరాల విస్తీర్ణం ఉన్న భవంతులు కొన్ని కట్టేసి వాటిల్లోని ప్రతి అంతస్తులోనూ వ్యవసాయం చేయాలని అనుకుంటోంది అక్కడి ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న షాంఘై నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిటీ సెంటర్‌కు మధ్యలో ఈ ప్రాజెక్టు రాబోతోంది.
‘ద సున్‌ఖ్వివావ్ అర్బన్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్’ పేరుతో సిద్ధమవుతున్న ఈ నిటారు సాగు క్షేత్రం ద్వారా కనీసం 2.4 కోట్ల మందికి సరిపడా ఆహార ఉత్పత్తులు అందుతాయని అంచనా. మట్టి అవసరం లేని హైడ్రోపానిక్స్, చేపల వంటి జలచరాల సాయంతో మొక్కలకు కావాల్సిన నైట్రోజన్‌ను అందించే ఆక్వాపానిక్స్ వంటి అత్యాధునిక సాగు పద్ధతులన్నీ ఇందులో ఉంటాయి. ఒక భవనంలో సముద్రపు నాచును పెంచితే ఇంకో దాంట్లో పండ్లు, కాయగూరలు పండిస్తారు. పక్కనే ప్రవహించే నదిపై తేలియాడే గ్రీన్‌హౌస్‌లూ ఉంటాయి. వీటితోపాటు భవనాల గోడలను కూడా రకరకాల ఆకుకూరల సాగుకు వాడుకుంతారు. ససాకీ అనే అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు పెద్దస్థాయిలో ఆహారాన్ని అందించేందుకు మాత్రమే కాకుండా ఆధునిక సాగు పద్ధతులను ప్రజలకు నేర్పించేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సైన్స్ మ్యూజియమ్, ఆక్వాపానిక్స్ టెక్నాలజీ ప్రదర్శన, అతిథులు కూడా సాగులో పాల్గొనేందుకు వీలు కల్పించే గ్రీన్‌హౌస్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. షాంఘై నగర వాసులు ఆహార పదార్థాల కోసం గ్రామాలపై ఆధారపడటం తగ్గితే అంతమేరకు తమ ఎగుమతులను పెంచుకోవచ్చునని చైనా ప్రభుత్వం అంచనా. బాగానే ఉంది ఐడియా!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్