బడుగులే నిర్ణేతలు
మధ్యప్రదేశ్‌లో ఫలితాలపై ప్రభావం చూపనున్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు
బీజేపీ నుంచి నెమ్మదిగా కాంగ్రెస్ వైపు చూపు
మధ్యప్రదేశ్‌లో 35 ఎస్సీ, 47 ఎస్టీ నియోజకవర్గాలు
మధ్యప్రదేశ్ నుంచి ప్రవీణ్, సాక్షి ప్రతినిధి: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులే జయాపజయాలను నిర్ణయించనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 230 నియోజకవర్గాల్లో 35 ఎస్సీ, 47 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1998 వరకు కాంగ్రెస్‌కు బాసటగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో దాదాపు 90 శాతం నియోజకవర్గాలు 2003 ఎన్నికల నాటికి బీజేపీ వైపు మొగ్గు చూపాయి.
అయితే, ఈ నెల 25న జరగనున్న ఎన్నికల్లో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గాల్లో కొంతమేరకు అభివృద్ధి చేసినా, ఇప్పటికీ పలు గ్రామాలకు మౌలిక వసతులు లేవు. రాష్ట్ర రాజధానికి దూరంగా సరిహద్దుల్లోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అధికంగా ఉన్న బేతుల్, చింద్వాడ, సివోని, బాలాఘాట్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను ‘సాక్షి’ బృందం సందర్శించింది. గత పదేళ్లలో బీజేపీ సర్కారు ఈ గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం, పాఠశాలలను మాత్రమే సమకూర్చగలిగింది.
అయితే, గ్రామాలకు విద్యుత్‌కాంతులు రావడంలో కేంద్రం వాటా కూడా ఉంది. పదేళ్ల బీజేపీ పాలనపై ఎస్సీ, ఎస్టీలు కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఇది మాత్రమే చాలదని వారు చెబుతున్నారు. వ్యవసాయానికి విద్యుత్తు, రోడ్డు మార్గాల విషయంలో తమ ప్రాంతాలు నేటికీ వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉచిత విద్యుత్తు, ఉచిత ఆహార పంపిణీ హామీలతో కాంగ్రెస్ సాగిస్తున్న ప్రచారం వారిని ఊరిస్తోంది. ఉచిత విద్యుత్తు, ఉచితంగా ఆహారం ఇస్తే మంచిదేనని, అయితే, కాంగ్రెస్ ఇస్తుందో లేదోనని సంశయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ రానున్న పదిరోజుల్లో ఈ ప్రాంతాల్లోకి తన మేనిఫెస్టోను బలంగా తీసుకువెళ్లగలిగితే బీజేపీకి కష్టకాలం తప్పకపోవచ్చు.
విద్యలో ఇంకా వెనుకబాటే: మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు విద్యలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం 6, 9, 11 తరగతుల్లో చేరే విద్యార్థులకు సైకిళ్లు సమకూర్చడంతో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయి తే, ఇంటర్ పూర్తిచేశాక డిగ్రీ కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు బస్సులు, ఆటోలను ఆశ్రయిం చి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అయినా, ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు చేరుకునేందుకు వారికి మూడు నాలుగు కిలోమీటర్ల కాలినడక తప్పదు.
బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుంది: సుష్మా
జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజానుకూలత రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆమె అన్నారు. గత పదేళ్లలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చూపిన నిబద్ధత కారణంగా తమ పార్టీపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన ఆమె కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
ఇంటికి కరెంటిస్తే సరిపోతుందా?
ఇంటికి 22 నుంచి 24 గంటల వరకు కరెంటు వస్తోంది. పొలాలకు రావొద్దా? బీజేపీ మా పల్లెల్లో వెలుగులు తెచ్చినా, ఇంతవరకే సరిపోదు. కాంగ్రెస్ ఉచితంగా కరెంటు ఇస్తామని చెబుతోంది. అయితే, ఇస్తుందో లేదో తెలియదు.. ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది.
-తారాసింగ్ ఖట్రే, మోహన్‌పూర్, బైహ్‌రా నియోజకవర్గం, బాలాఘాట్ జిల్లా
ఇల్లు ఇచ్చింది.. కానీ కూలీ సరిపోదు..
ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చింది. అయితే, మాకు పొలం లేదు. కొంతైనా భూమి, పాడిపశువులను ఇస్తే వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటాం.
- సంతూ మార్కామ్, కూలీ, ఉక్‌వా, బైహ్‌రా నియోజకవర్గం
3 కిలోమీటర్లు నడిచేవెళుతున్నా..
నేను జిల్లా కేంద్రంలో బీఏ మూడో సెమిస్టర్ చదువుతున్నా. రోజూ మూడు కిలోమీటర్లు నడిచివెళ్లాల్సిందే. అక్కడి నుంచి మళ్లీ ప్రైవేటు బస్సుల్లో వె
ళ్లాలి. ప్రభుత్వ పరంగా బస్సు సౌకర్యం లేదు. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.
-రాఖీ పవార్, బీఏ థర్డ్ సెమిస్టర్, బేతుల్ జిల్లా
ప్రైవేటు కాలేజీల్లో ఖర్చు ఎక్కువ
అమ్మా నాన్నలు చిన్నకారు రైతులు. నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతున్నా. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వం మాకు ప్రైవేటు కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలి.
-సప్న వంజారే, బీఎస్సీ థర్డ్ సెమిస్టర్, బేతుల్ జిల్లా