హార్ధిక్ కు స్వర నమూనా పరీక్ష
అహ్మదాబాద్: దేశ ద్రోహం కేసులో అరెస్టైన హార్ధిక్ పటేల్ కు బుధవారం స్వర నమూనా పరీక్ష నిర్వహించారు. గాంధీనగర్ లోని ఫోరెన్సెనిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ ఎల్)లో హార్థిక్ కు 'వాయిస్ స్పెక్ట్రోగ్రఫీ' పరీక్ష నిర్వహించినట్టు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కేఎన్ పటేల్ తెలిపారు. హార్థిక్ అనుమతితోనే ఈ పరీక్ష చేసినట్టు చెప్పారు. ఫోన్ సంభాషణల ఆధారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.
ఫోన్ లో మాట్లాడింది హార్దిక్ అవునో, కాదో తెలుసుకునేందుకు స్వర నమూనా పరీక్ష నిర్వహించారు. ఈ కేసులో హార్థిక్ తో పాటు పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకులు చిరాగ్ పటేల్, దినేశ్ పటేల్, కేతన్ పటేల్, అల్పేశ్ కాతిరియా, అమ్రిశ్ పటేల్ లను కూడా అరెస్ట్ చేశారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న హార్థిక్ పటేల్ పై నమోదైన రెండో రాజద్రోహం కేసు ఇది. అంతకుముందు సూరత్ పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు.