రాష్ట్ర విభజన అంశంలో పలు అనుమనాలు, చిక్కుముడులతో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడిన తరుణంలో సమస్య పరిష్కారానికి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు పరస్పర సహకారం, సామరస్యపూర్వక భేటీకి సిద్ధమవుతున్నారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంలో పలు అనుమనాలు, చిక్కుముడులతో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడిన తరుణంలో సమస్య పరిష్కారానికి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు పరస్పర సహకారం, సామరస్యపూర్వక భేటీకి సిద్ధమవుతున్నారు. గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ భేటీ జరగనుంది. మంగళవారం సీఎల్పీలో భేటీ అయిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఈ భేటీలపై ఆలోచనలు సాగించడం తెలిసిందే. విభజన నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలు, చీలిక అనంతరం ఏర్పడే ఇబ్బందులు ముఖ్యంగా నీరు, విద్యుత్, హైదరాబాద్‌తో పాటు ఉద్యోగులు లేవనెత్తుతున్న అంశాలను ఈ భేటీలో చర్చించాలని నిర్ణయించారు. ఇరుప్రాంతాలకు శ్రేయస్కరమైన రీతిలో పరిష్కారం ఉండేలా భేటీలో చర్చించనున్నామని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. తెలంగాణ నేతలు విభజన కోరుకోవడానికి దారితీసిన పరిస్థితులు, అందుకు గల కారణాలపై లోతుగా చర్చించాలని భావిస్తున్నారు. విభజన డిమాండ్ రావడానికి కారణమైన అంశాలను, వాటికి పరిష్కారాలను అన్వేషించనున్నారు.
ఇందుకు సంబంధించి అనేక ప్రతిపాదనలను తెలంగాణ నేతల ముందుంచేందుకు సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణకు రాజకీయంగా, అభివృద్ధిపరంగా లేదా మరే ఇతర అంశాల్లో అన్యాయం జరిగిందనుకుంటే వాటిని సమైక్యంగా ఉంటూనే సరిదిద్దుకోవచ్చని ప్రతిపాదించనున్నారు. ఆయా అంశాలను పరిష్కరించుకొనేందుకు అవసరమైనంతకాలం రాజకీయ అధికారాన్ని పూర్తిగా తెలంగాణ నేతలకు అప్పగించే అంశాన్ని కూడా వారి ముందు పెడతామని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. ‘‘విభజనపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నా దానివల్ల తలెత్తే సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని తెలంగాణ సోదరులకు వివరిస్తాం. అక్కడి ప్రజలను నొప్పించని రీతిలో పరిష్కారాన్ని అన్వేషిస్తాం. ఇది ఒక్క భేటీతోనే తేలిపోతుందనుకోవడం లేదు. హైదరాబాద్‌లో భేటీ తర్వాత తిరుపతి, విశాఖపట్నంల లో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నాం’’ అని రాయలసీమకు చెందిన మంత్రి ఒకరు తెలిపారు. విభజనకు ఇతర పార్టీలు సానుకూలత ప్రకటించినా అంతిమంగా నిర్ణయం తీసుకునేది కాంగ్రెసే కాబట్టి తమ పార్టీపైనే ఎక్కువ బాధ్యత ఉందని పేర్కొన్నారు.