వేర్పాటుపై తిరుగుబాటు | seemandhra people agitations rise against to state bifurcation | Sakshi
Sakshi News home page

వేర్పాటుపై తిరుగుబాటు

Published Sat, Sep 7 2013 1:29 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

వేర్పాటుపై తిరుగుబాటు - Sakshi

వేర్పాటుపై తిరుగుబాటు

 సాక్షి నెట్‌వర్క్ :  తెలుగుజాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజానీకం తిరుగుబాటు ఉధృతంగా సాగుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 38వరోజైన శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉవ్వెత్తున ఎగసింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మహిళలు 101 బోనాలెత్తుకుని రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ పూజలు చేపట్టారు. పట్టణంలోని జేఏసీ శిబిరాన్ని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో బ్రాహ్మణులు శాంతి హోమం నిర్వహించారు. దేవనకొండలో సమైక్యంధ్రను కోరుతూ 990 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా కళాకారుల ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్  అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక్కరోజు దీక్షలో కూర్చున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వ్యాపారుల సంఘం బంద్ పాటించింది. నెల్లూరులో రైతులు ట్రాక్టర్లతో తడ తహశీల్దార్ కార్యాలయం నుంచి బజారుసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రధాన బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన, మానవహారం జరిగాయి.  పొదలకూరులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు.
 
 కవితా గర్జన
 ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా గ్రంథాలయం ఎదుట కవులు, రచయితలు తమ గళం, కలాలతో కవితా గర్జన నిర్వహించి సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. ఉలవపాడు ఎంఈవో శ్రీమన్నారాయణ ఆమరణ దీక్షకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు సంఘీభావం పలికారు. అద్దంకిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, పొక్లయిన్లతో భారీ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్ర కోరుతూ గుంటూరు, చిలకలూరిపేటలో  ముస్లింలు భారీ శాంతి ప్రదర్శన నిర్వహించారు. బాపట్లలో మున్సిపల్ ఉద్యోగులు అర్ధనగ్నప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా జగయ్యపేటలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. విజయవాడలోని కెనాల్ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్యోగ సంఘాలు సర్వమత ప్రార్ధనలు నిర్వహించాయి. పాత బస్టాండ్ వద్ద  దేవాదాయశాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో 10 వేల మంది రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో రోడ్డుపైనే పరీక్షలు రాసి విద్యార్థులు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ఆధ్వర్యంలో వందలాది మంది చెవిటి, మూగ, వికలాంగులు అనపర్తి దేవీచౌక్‌లో ధర్నా చేపట్టారు. రాజమండ్రిలో 190 మంది రక్తదానం చేసి తెలంగాణలోని ఆస్పత్రులకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గంపేటలో గృహిణులు జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు.  
 
 బొత్స దంపతులపై బొబ్బిలిలో ఫిర్యాదు
 పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ దంపతులు  కనిపించడంలేదంటూ  బార్ అసోసియేషన్ సభ్యులు విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో సమైక్యవాదులు ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా  బ్రాహ్మణులు రోడ్డుపై విశ్వశాంతి యోగం నిర్వహించి  72 గంటల దీక్షను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా  నరసన్నపేటలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలపగా, టెక్కలిలో రోడ్లు ఊడ్చారు. విశ్రాంత ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాయం ఆవరణలో వంటావార్పు చేపట్టారు. పాలకొండలో ఎన్.కె.రాజపురం గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 టీడీపీ ఆఫీసుపై టమాటాలతో దాడి
 కర్నూలు : రాష్ట్ర విభజనకు ముందుగానే బ్లాంక్ చెక్ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు బస్సు యాత్రలు చేస్తున్న చంద్రబాబునాయుడు ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించి టమాటాలతో దాడిచేశారు.
 
 ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీ తెలుగు ప్రజల కోసమే పుట్టిందని టీడీపీ కార్యకర్తలు చెప్పగా, అది ఎన్టీఆర్ ఉన్నప్పటి మాట అని, చంద్రబాబు వచ్చాక రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఆయన కేంద్రానికి  లేఖ రాశారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందన్న ధైర్యంతో కేంద్రం రాష్ట్ర విభజనకు బరితెగించిందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉపాధ్యాయులు వెనుదిరుగుతూ ముందుగానే తెచ్చుకున్న టమాటాలను టీడీపీ కార్యాలయంపైకి  విసిరారు.  
 
 కలిసే ఉందాం.. మార్మోగిన లక్ష గొంతుకల సమైక్య భే రి
 సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో లక్షలాదిమంది ప్రజ రోడ్లపైకి వచ్చి సమైక్య భేరి మార్మోగిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన లక్షగళ సమైక్యభేరిలో ఉద్యమకారులు గర్జించారు. వేర్పాటువాదాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా  జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన లక్ష జనగళ ఘోషతో పట్టణమంతా జై సమైక్యాంధ్ర నినాదం పోటెత్తింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రెడ్ల సంఘం ఆధ్వర్యంలో 20 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. వంగపండు ఉష ఆటాపాటతో సమైక్య వాదుల్లో ఉత్తేజాన్ని నింపారు.
 
 తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర పరిధిలోని విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు కంబాలచెరువు సెంటర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాజులూరు నుంచి గొల్లపాలెం వరకు ఐదువేల మందికి పైగా సమైక్యవాదులు 20 కిలోమీటర్ల మేరపాదయాత్ర చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో 10 వేల మందికిపైగా ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర గర్జన వినిపించారు. మార్టూరులో వేలాదిమంది విద్యార్థులు జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్వహించిన ‘సింహగర్జన’ బహిరంగసభలో వేలాదిమంది విద్యార్ధులు పాల్గొని సమైక్యనినాదాలు హోరెత్తించారు.
 
  రోజా దీక్ష
 చిత్తూరు : నగరి టవర్‌క్లాక్ కూడలిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్‌కే రోజా శుక్రవారం ఒకరోజు  దీక్ష చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో వికలాంగులు, మదనపల్లెలో బుద్ధిమాంద్యం విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. పెనుమూరులో క్రైస్తవులు వంటావార్పు, కుప్పంలో వన్నెకుల క్షత్రీయులు హోమం నిర్వహించారు. పుంగనూరులో ఉపాధ్యాయులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement