కొత్త ఏడాదిలో తొలి ధమాకా! | Sensex ends 376 points up; 136 stocks hit 52-week highs | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో తొలి ధమాకా!

Published Tue, Jan 14 2014 1:22 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

కొత్త ఏడాదిలో తొలి ధమాకా! - Sakshi

కొత్త ఏడాదిలో తొలి ధమాకా!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రోత్సాహకర ఫలితాలు.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచకపోవచ్చన్న అంచనాలు.. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ట్యాపరింగ్‌ను సడలిస్తుందన్న వార్తలు... దేశీ స్టాక్ మార్కెట్లలో  జోష్ నింపింది. కొత్త ఏడాదితో తొలి ధమాకా లాభాలతో పాటు ఏడు వారాలుగా చూడని భారీ ర్యాలీ జరిగింది. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 376 పాయింట్ల ఎగిసి 21,134 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 101 పాయింట్లు ర్యాలీ జరిపి 6,273 పాయింట్ల వద్ద ముగిసింది. ఆయా రంగాలకు చెందిన 12 బీఎస్‌ఈ సూచీల్లో ఒక్క హెల్త్‌కేర్ ఇండెక్స్ మినహా అన్నీ పెరగడం విశేషం. ర్యాలీకి ఐటీ, బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహించాయి. శుక్రవారం మార్కెట్ అంచనాల్ని మించిన ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మరో 3 శాతం ఎగిసి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి రూ. 3,665 వద్ద ముగిసింది.
 
 ఇదే బాటలో త్వరలో ఫలితాలు వెల్లడించనున్న టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లు 3-4 శాతం మధ్య ర్యాలీ జరిపి రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. ఆహారోత్పత్తుల ధరలు తగ్గడంతో నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయి నుంచి దిగుతుందన్న ఆశాభావంతో బ్యాంకింగ్ షేర్లలో సైతం కొనుగోళ్లు జరిగాయి. కోటక్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐలు 1-3 శాతం మధ్య పెరిగాయి. మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన డేటా ప్రకారం ద్రవ్యోల్బణం 9.87 శాతానికి తగ్గింది.
 
 నవంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 2.1 శాతం ప్రతికూల వృద్ధిని కనపర్చడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుదల అంచనాల కారణంగా వచ్చే పరపతి విధాన సమీక్షలో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు పెంచబోదన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో ఏర్పడిందని, దాంతో ఒక్కసారిగా మార్కెట్లో కొనుగోళ్లు జరిగినట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. అలాగే క్రితం వారం అమెరికాలో విడుదలైన జాబ్స్ డేటా బలహీనంగా వున్నందున ట్యాపరింగ్‌పై ఫెడ్ పునరాలోచించవచ్చన్న భావన ఇన్వెస్టర్లలో ఏర్పడిందని ఆ వర్గాలు వివరించాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టీ, డీఎల్‌ఎఫ్‌లు 2-3% మధ్య పెరిగాయి.  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 413 కోట్ల తాజా పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 317 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
 
 ఐటీ ఇండెక్స్ టాప్...
 బీఎస్‌ఈ సెక్టొరల్ సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఐటీ ఇండెక్స్ 2.92 శాతం ర్యాలీ జరిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 2.24 శాతం, బ్యాంకెక్స్ 2.04 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచి 1.55 శాతం చొప్పున పెరిగాయి. ఫార్మా ఇండెక్స్ 0.68% తగ్గింది. ర్యాన్‌బాక్సీ ప్లాంటు పట్ల అమెరికా డ్రగ్ అథారిటీ ఆందోళన వ్యక్తంచేయడంతో ఈ షేరు 5 శాతంపైగా క్షీణించింది.
 
 నిఫ్టీ ఫ్యూచర్లో లాంగ్ బిల్డప్...
 కొత్త ఏడాది ప్రారంభం నుంచి నిఫ్టీ ఫ్యూచర్లో లాంగ్ పొజిషన్లను క్రమేపీ ఆఫ్‌లోడ్ చేస్తున్న ఇన్వెస్టర్లు సోమవారం మాత్రం తాజా పొజిషన్లు తీసుకున్నారు. లాంగ్ బిల్డప్‌ను సూచిస్తూ స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 13 పాయింట్లకు పెరిగింది. శుక్రవారం ఈ ప్రీమియం 7 పాయింట్లే వుంది. అలాగే ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా 5.28 లక్షల షేర్లు (3.10 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.76 కోట్ల షేర్లకు పెరిగింది. 6,200 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. దాంతో ఈ కాల్ ఆప్షన్ నుంచి 9.13 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 21.67 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. 6,300, 6,400 కాల్ ఆప్షన్ల నుంచి కూడా 3.21 లక్షలు, 3.76 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యాయి. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 6,300 స్థాయిని అధిగమించగలదని, ఏదైనా ప్రతికూల వార్త కారణంగా క్షీణత సంభవిస్తే 6,200 స్థాయి గట్టి మద్దతును అందించగలదని ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నట్లు ఈ ఆప్షన్ యాక్టివిటీ సూచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement