సెన్సెక్స్, నిప్టీ చారిత్రాత్మక మెరుపులు
ముంబై: ప్రపంచ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలను తాకాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 30,007 వద్ద ఆల్ టైం హై స్థాయిని తాకగా నిఫ్టీ కూడా అదే బాటలో పయనించడం విశేషం. నిఫ్టీ ఇంట్రాడేలో 9,268ని చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఉదయనుంచి గ్రీడ్ అండ్ ఫియర్ మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో మిడ్‌సెషన్ అనంతరం కొనుగోళ్ళ ధోరణి నెలకొంది. మరోవైపు ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ లాభాలు మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది. మిడ్ క్యాప్ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ గరిష్ట స్థాయిలో 64 పాయింట్ల లాభంలో 29,974 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల లాభంలో 9250కి పైనే ముగిసింది.
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో పురోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ సుజుకి, అదానీ పోర్ట్స్ 4 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఇన్‌ఫ్రాటెల్, హిందాల్కో, జీ, ఆర్‌ఐఎల్, గ్రాసిమ్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, బీవోబీ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఐటీసీ , ఇన్ఫోసిస్ నష్టాల్లో నడిచాయి. దీంతో ఎనలిస్టులు కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. అయితే ఈ స్తాయిల్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
కాగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష రేపు (గురువారం) జరగనుంది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంటాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నప్పటకీ, మదుపర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు.