సెన్సెక్స్ 450 పాయింట్లు పతనం
ఒక్క రోజు గ్యాప్ తరువాత మళ్లీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. అన్ని వైపుల నుంచి వెల్లువెత్తిన అమ్మకాలతో సెన్సెక్స్ 449 పాయింట్లు పతనమైంది. 6 వారాల తరువాత మళ్లీ 19,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 18,733 వద్ద ముగిసింది. గత శుక్రవారం వరకూ 8 వరుస రోజుల్లో 1,138 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం నామమాత్రంగా లాభపడ్డ సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా ఇదే విధంగా స్పందిస్తూ 143 పాయింట్లు దిగజారింది. వెరసి నాలుగు నెలల కనిష్టమైన 5,542 వద్ద నిలిచింది. ఇందుకు రూపాయి పతనంతోపాటు, పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపాయి. ఫలితంగా 2009 జూన్ తరువాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడింది! మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 989 బిలియన్ డాలర్ల(రూ. 60,18,504 కోట్లు) వద్ద స్థిరపడింది.
కారణాలేంటి?
జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్‌లో పాక్ నుంచి చొరబడిన సాయుధులు కొందరు ఐదుగురు భారత సైనికులను హతమార్చడంతో మంగళవారం ఉదయమే మార్కెట్లో టెన్షన్లు పెరిగాయి. ఇదికాకుండా ఇటీవల డాలరుతో మారకంలో బలహీనపడుతున్న రూపాయి ఉన్నట్టుండి 61.80కు పడిపోవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. ఇది చరిత్రాత్మక కనిష్ట స్థాయికాగా, ఇది కరెంట్ ఖాతా లోటును మరింత పెంచనుంది. ఇక మరోవైపు వర్ధమాన మార్కెట్ల నుంచి డాలర్ల నిధులు వెనక్కు మళ్లుతాయన్న ఆందోళనలు తాజాగా చెలరేగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ప్రస్తుతం అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే ఎత్తివేయవచ్చునన్న అంచనాలు పెరగడమే దీనికి కారణం. ఇవి చాలవన్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్)లో ఏర్పడ్డ చె ల్లింపుల సంక్షోభం నేపథ్యంలో ‘ఈ’ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం ప్రభుత్వం నిషేధించడంతో అగ్నికి ఆజ్యం పోసి న ట్లయ్యింది. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి.
అన్ని రంగాలూ డీలా
బీఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య పతనమయ్యాయి. ప్రధానంగా వినియోగ వస్తువులు, రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, పవర్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ 5.5-2% మధ్య నీర సించాయి.
సెన్సెక్స్, నిఫ్టీలలో 3 షేర్లు మాత్రమే లాభపడగా, టాటా పవర్ అత్యధికంగా 15% కుప్పకూలింది.
మిగిలిన దిగ్గజాలలో భెల్, హెచ్‌డీఎఫ్‌సీ, స్టెరిలైట్, టాటా స్టీల్, భారతీ, బజాజ్ ఆటో, జిందాల్ స్టీల్, ఎల్‌అండ్‌టీ 6.6-2.3% మధ్య పతనమయ్యాయి.
బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ 4-2.5% మధ్య తిరోగమించగా, ఆయిల్ దిగ్గజాలు ఓఎన్‌జీసీ 3.3%, ఆర్‌ఐఎల్ 2.4% చొప్పున నష్టపోయాయి.
మార్కెట్లను మించుతూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6% నీరసించగా, స్మాల్ క్యాప్ 1.8% క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,599 నష్టపోగా, 655 మాత్రమే బలపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈఎల్‌లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లు సైతం నిలిచిపోవడంతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 20% కుప్పకూలి రూ. 159 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్ షేరు ఎంసీఎక్స్ సైతం 10% పతనమై రూ. 332 వద్ద నిలిచింది.
ఎఫ్‌ఐఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి.