ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల్లో 'ప్రత్యేక' హింస
ఈశాన్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రత్యేక హింస రగులుతూనే ఉంది. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా శనివారం నుంచి ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది.
డార్జిలింగ్, కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రామమ్-రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు. మరోవైపు... అసోంలో ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. దిపు-దోల్డోలి స్టేషన్ల మధ్య పట్టాలను తొలగించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.
పశ్చిమ కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక బోడోలాండ్ ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అసోంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.