కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) మరోసారి షాక్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) మరోసారి షాక్ ఇచ్చింది. గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించాలన్న ప్రతిపాదనను పరిశీలించేందుకు డీజీహెచ్ నిరాకరించింది. డీజీహెచ్ డెరైక్టర్ జనరల్ ఆర్‌ఎన్ చౌబే నేతృత్వంలోని బ్లాక్ నిర్వహణ కమిటీ(ఎంసీ) దీనికి ‘నో’ చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్వతంత్ర నిపుణుల కమిటీ అవసరమేనని ఎంసీ భేటీలో చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే అభిప్రాయపడగా... ఇతర సీనియర్ అధికారులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సమాచారం.
దీంతో నిర్ణయం తీసుకోలేదు. స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలని ఆర్‌ఐఎల్ చాన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్న విషయం విదితమే. గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి బావుల్లోకి నీరుచేరడం, ఇసుక మేటలు వేయడం వంటి భౌగోళిక సమస్యలే కారణమని ఆర్‌ఐఎల్ చెబుతూవస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గ్యాస్ ధర పెంపు తర్వాత లాభాలు దండుకోవడానికి ఆర్‌ఐఎల్ గ్యాస్‌ను దాచిపెట్టి, మాయచేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిలో నిజానిజాలను తేల్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తగినన్ని బావులను తవ్వకపోవడంవల్లే గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి దిగజారిందని డీజీహెచ్ పదేపదే స్పష్టం చేసింది.