వరద బీభత్సం.. 100 మంది మృతి
- అసోంలో బ్రహ్మపుత్ర విలయతాండవం
- 22 లక్షల మంది నిరాశ్రయులు.. నీట మునిగిన కజిరంగా పార్కు
- రోడ్లపైకి కొట్టుకొచ్చిన భారీ చేపలు, ఏనుగులు..
- అసోం పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా..సీఎం సోనోవాల్‌కు ఫోన్
గువాహటి: "అసోం దుఃఖదాయిని" బ్రహ్మపుత్రా నది విలయతాండవానికి 100 మంది బలయ్యారు. 22 లక్షల మందికిపైగా నిరాశ్రయులు కాగా వందల వేల సంఖ్యలో జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన బ్రహ్మపుత్రా నది.. గడిచిన మూడు రోజులుగా అతిప్రమాదకరంగా ప్రవహిస్తూ తీరం వెంబడి ఊళ్లన్నింటినీ ముంచేస్తోంది. నదిలోకి ఇంకా వరద వచ్చిచేరుతుండటంతో ఉధతి ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడంలేదు.
బ్రహ్మపుత్రతోపాటు ఇతర నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని 22 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. సోమవారం ఒక్కరోజే వరదలో చిక్కుకుని 16 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రోజురోజుకూ పరిస్థితి దారుణంగా మారుతుండటంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
లోయర్ అసోం, అప్పర్ అసోం డివిజన్లలోని కోక్రాఝర్, ధుబ్రి, బొంగైగావ్, దిబ్రూఘర్, ధేమాజీ, కలియాబర్ తదితర జిల్లాల్లో ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. అసోం ప్రభుత్వ లెక్కల ప్రకారం 490 పునరావాస కేంద్రాలు మాత్రమే ఉండగా, వాటిలో కేవలం 2లక్షల మంది మాత్రమే ఆశ్రయం పొందుతున్నారు. మిగిలిన 20 లక్షల మంది దయనీయ స్థితిలో కాలంగడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయాన్ని కేంద్రం తక్షణమే అందిస్తుందని సీఎంకు చెప్పారు.
రోడ్లపైకి భారీ చేపలు.. బురదలో ఏనుగు
వరద ఉధృతికి భారీ చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చిన దృశ్యాల తాలూకు వీడియోలు అసోంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తున్నాయి. కలియాబోర్ వద్ద జలప్రవాహంలో మునిగిపోయిన జాతీయ రహదారిపై జనం గుమ్మికూడి ఉండగా.. పెద్దపెద్ద చేపలు అటుగా కొట్టుకొచ్చాయి. ప్రఖ్యాత కజిరంగా జాతీయ పార్కు 85 శాతం నీట మునగడంతో అక్కడి జంతుజాలం వరదలో కొట్టుకుపోయాయి. కాలువలో పడిపోయిన ఏనుగును, పొదల్లో చిక్కుకున్న ఖడ్గమృగం పిల్లను స్థానికులు కాపాడు. సంబంధిత వీడియోలను నందన్ ప్రతీమ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.