చాపెల్ చూశావా.. దిమ్మతిరిగే బదులు!
పాకిస్థాన్ ట్రెండ్ సెట్టర్ బ్యాట్స్‌మన్ షాహిద్ ఆఫ్రిదీ.. మైదానంలో మెరుపులు మెరిపించే ఈ ఆటగాడిని పాక్ క్రికెట్ అభిమానులు ‘బూమ్ బూమ్ ఆఫ్రిదీ’ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం జట్టులో లేకపోయినా.. 36 ఏళ్ల ఆఫ్రిదీ తనదైన స్టైల్‌లో జట్టుకు అండగా నిలిచాడు. పాకిస్థాన్ జట్టు చెత్త క్రికెట్ ఆడుతున్నదని, ఆ జట్టున ఆస్ట్రేలియా పర్యటనకు పిలిచి ఉండాల్సింది కాదని ఆస్ట్రేలియా క్రికెటర్ ఇయాన్ చాపెల్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ జట్టు పోరాడినప్పటికీ.. 3-0 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో చెలరేగిపోయిన చాపెల్ పాక్ జట్టుపై నోరుపారేసుకున్నాడు. దీనికి దీటుగా అన్నట్టు రెండో వన్డేలో పాక్ జట్టు చెలరేగింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై పాక్ జట్టుకు లభించిన తొలి విజయమిది. దీంతో ఉర్రూతలూగిన ఆఫ్రిదీ.. చాపెల్‌కు గట్టి బదులిచ్చాడు. ’శభాష్ పాకిస్థాన్. గొప్ప సారథ్యం, గొప్ప ఇన్నింగ్స్ హఫీజ్. వెల్డన్ జేకే, మాలిక్. ఇయాన్ చాపెల్ మ్యాచ్ చూశావా’ అంటూ ఆఫ్రిదీ ట్వీట్ చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 220 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ ఆమిర్ మూడు, జునైద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ 72 పరుగులు, షోయబ్ మాలిక్ 42 పరుగులు చేయడంతో 2.2 ఓవర్లు మిగిలి ఉండగానే పాక్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది.