మీ తల్లిదండ్రుల్ని, మీ ఊళ్లో వారిని అడగండి.. వారు ఏది చెబితే అదే చేయండి
ఇప్పటికీ రాజీనామాలు చేయని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు షర్మిల హితవు
వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే
మిగతా పార్టీ వారూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగిపోయేది
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విభజన నిర్ణయం తీసుకుంది
వైఎస్‌ఆర్ సీపీ, ఎంఐఎం, సీపీఎం ఏనాడూ విభజనకు అంగీకరించలేదు
చంద్రబాబు ఇచ్చినలేఖ వల్లే విభజన.. దాన్ని ఆయన వెనక్కు తీసుకోవాలి
బాబు, ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఓట్లు, సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయంతో రాష్ట్రం అట్టుడికిపోతోందని, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకొని వేలాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పటికైనా మేలు కోవాలని, తమకు ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని కోరారు. ‘‘అయ్యా నాయకులారా ఒక్క మాట చెప్తాను.. చిన్నదాన్ని కదా అని నా మాటను తీసిపారేయకండి.. ఒక్కసారి మీ ఇంటికెళ్లి మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని ‘నేను సీమాంధ్ర ప్రజల కోసం ఉద్యమించాలా లేదా?’ అని అడగండి. వాళ్లు ఏది చెబితే అదే చేయండి. ఒక్కసారి మీ ఊరికెళ్లండి.. అక్కడ ఏదో ఒక పొలానికి వెళ్లి అక్కడ రైతును అడగండి. ఆ భూమి పుత్రులు ఏది చెబితే అదే చేయండి. అక్కడ కూలి పని చేసుకుంటున్న ఏదో ఒక రైతు కూలీని అడగండి.. అతడు ఏది చెబితే అదే చేయండి. మీకు తెలిసిన స్కూలు మాస్టార్ దగ్గరకు వెళ్లి అడగండి.. ఆ జ్ఞాని ఏది చెబితే అదే చేయండి.
అక్కడే చదువుకుంటున్న ఒక చిన్న విద్యార్థిని కూడా అడగండి.. ఆ స్వచ్ఛమైన మనసు, కలుషితం లేని మనసు ఏది చెబితే అదే చేయండి. ఇంకా మీకు ఓపిక ఉంటే.. మీ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామానికి వెళ్లి, ఏదో ఒక వీధికి వెళ్లి, ఎవర్నయినా అడగండి.. మీకు ఓపిక ఉన్నంతవరకు అడగండి. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మీరు తింటున్న అన్నం మీద ఒట్టేసుకుని మీ మనస్సాక్షిని అడగండి. కళ్లు మూసుకుని పడుకునే ముందు మీకు ఓట్లేసిన ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి.
పొద్దున్నే లేచి దేవుడికి దణ్ణం పెట్టుకుని, దేవుని దృష్టికి ఏది యథార్థమనిపించిందో అది చేయండి.. చాలు మీ జన్మలు ధన్యమైపోతాయి’’ అని షర్మిల హితవు పలికారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఐదో రోజు శుక్రవారం కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో సాగింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల, వైఎస్‌ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరులలో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
బాబు లేఖతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సాహసం..
‘‘ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విభజన యత్నాలతో రాష్ట్రం అగ్నిగుండంలా రగులుతోంది. ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో కనీసం చలనం లేదు. ఎలా ఉంటుంది.. అసలు తెలంగాణను ఇచ్చేయండి అంటూ ఒక బ్లాంక్ చెక్ రాసిచ్చినట్లు లేఖ రాసిచ్చేశారు ఈయన. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందీ అంటే దానికి కారణం.. చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖే. మన రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలకు ఈ రోజు తీరని అన్యాయం జరగబోతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున నిలబడి, పోరాటం చేసి, గొంతెత్తి ఇది అన్యాయమని చెప్పి పాలక పక్షాన్ని కాలర్ పట్టుకునైనా సరే నిలదీయాల్సింది చంద్రబాబు. కానీ ఆయన ఈ రోజు ఆ పని చేయలేదు సరికదా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతున్నామని ప్రకటిస్తే.. ఈయన విలేకరుల సమావేశం పెట్టి.. నాలుగు లక్షల కోట్లీయండి అంటూ హైదరాబాద్‌ను అమ్మకానికి పెట్టేశారు. అసలు ఈయన ప్రతిపక్ష నాయకుడా లేక దుర్మార్గుడా?
చంద్రబాబును చూసి తెలుగుతల్లే తలదించుకుంటుంది..
చంద్రబాబు పట్టపగలు సీమాంధ్రుల గొంతుకోసి ఈ రోజు యాత్రలంటూ తిరుగుతున్నారు. ప్రజలంతా ఏ మొహం పెట్టుకొని యాత్ర చేస్తున్నారని చంద్రబాబును నిలదీయాల్సిన అవసరముంది. ఇంత అన్యాయం జరుగుతున్నా.. మీరుగాని, మీ ఎమ్మెల్యేలుగాని, మీ ఎంపీలుగాని ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీయాలి. అసలు మీరు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎలా ఇచ్చారు.. ఎవర్నడిగి ఇచ్చారని ప్రజలంతా నిలదీయాలి. ఆయన ఈ రోజు ఇంతటి నీచానికి పాల్పడ్డారంటే.. అసలు ఈయన పుట్టింది ఈ గడ్డమీదేనంటే తెలుగు తల్లే అవమానంతో తలదించుకుంటుంది. టీడీపీ సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటే, 3 పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎంలు ఎప్పుడూ ఈ విభజనకు ఒప్పుకోలేదు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సీమాంధ్రుల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఉన్నా, ఇప్పటికైనా ఆ లేఖ వెనక్కి తీసుకోవాలి. తప్పయిపోయింది అని చెప్పి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలి.
విభజన ప్రక్రియ ఆగిపోయేది..
హఠాత్తుగా ఏ పరిష్కారమూ చూపకుండా అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొడుతున్నామని కాంగ్రెస్ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి తమ నిరసన తెలియజేశారు. అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాజీనామాలు చేసి, తమ వంతు పోరాటంగా నిరాహార దీక్షలు కూడా చేశారు. అంతమంది రాజీనామాలు చేసినప్పుడు.. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి ఉంటే దేశం మొత్తం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తిరిగి చూసేది. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది.
ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలి..
ఇప్పటికే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు నీళ్లు వదలని పరిస్థితి చూస్తున్నాం. మళ్లీ మధ్యలో మరో రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం కృష్ణా నీళ్లను అడ్డుకుంటే శ్రీశైలానికి, నాగార్జున సాగర్‌కు నీళ్లెలా వస్తాయి? శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే.. కేసీ కెనాల్, తెలుగు గంగ, బీఎంఎస్, హంద్రీ నీవాకు నీళ్లెలా వస్తాయి? వీటికి నీళ్లు రాకపోతే.. ఆ ఆయకట్టు ప్రాంతమంతా ఎండిపోదా? గడప గడపకూ ఆత్మహత్యలు జరిగి గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోతాయి. పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని అంటున్నారు.. మధ్యలో మరో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే ఆ ప్రాజెక్టును ఎలా నింపుతారో మాత్రం చెప్పడం లేదు. కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం మహా ఎడారిగా మారదా? ఒకప్పుడు మద్రాసు నుంచి పొమ్మన్నారు. హైదరాబాద్‌పై ఇప్పుడు మీకు హక్కులు లేవంటున్నారు. నిర్మించడానికి అరవై ఏళ్లు పట్టిన హైదరాబాద్ లాంటి రాజధానిని పదేళ్లలో నిర్మించుకోవడం సాధ్యమేనా?’’
ఆర్టీసీ డ్రైవర్ మృతికి సంతాపం..
సమైక్యాంధ్ర కోసం ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంకు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ మునయ్య మృతికి షర్మిల సంతాపం తెలిపారు. ప్రొద్దుటూరులో సమైక్య శంఖారావం వేదిక మీద నుంచి షర్మిలతో పార్టీ నాయకులు, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
మరో ఐదు జిల్లాల యాత్ర షెడ్యూల్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు సంబంధించి మరో ఐదు జిల్లాల పర్యటనా వివరాలను వైఎస్‌ఆర్ సీపీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. ఆ వివరాలివీ.. 8వ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలిలలో షర్మిల సభలు నిర్వహించనున్నారు. 9న వినాయక చవితి పర్వదినం కావడంతో యాత్రకు విరామం. 10న ప్రకాశం జిల్లాలో కనిగిరి, మార్కాపురం, 11న గుంటూరు జిల్లా వినుకొండ, రేపల్లె, కృష్ణా జిల్లా అవనిగడ్డ, 12న పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు, ఏలూరులలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
మాది మొదటి నుంచీ ఒకటే మాట..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పింది.. ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా, ఒక తండ్రిలా అందరికీ న్యాయం చేయండి.. ముందు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి.. అందర్నీ పిలవండి.. అందరితో చర్చలు జరపండి.. అని కాంగ్రెస్ పార్టీకి పదే పదే చెప్పింది.. లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ చెబుతోంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. మీకు న్యాయం చేసే ఉద్దేశం లేకపోతే ఆ అధికారాన్నిగాని, ఆ బాధ్యతనుగాని ఎందుకు తీసుకున్నారు? న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే.. విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని, అది మీకు చేతకాదని తేలిపోయింది కాబట్టి.. రాష్ట్రాన్ని యథాతథంగానే, సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. మా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే.. జగనన్న నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకొని కూర్చోదు. జగనన్న నాయకత్వంలో ఎందాకైనా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. - షర్మిల
ఈ సీఎం పనికొస్తారా?
‘‘గత నాలుగేళ్లుగా మన రాష్ట్రం అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వేయకపోగా, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. దానికి కారణం మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. కిరణ్‌కుమార్‌రెడ్డికి సంక్షేమం అన్నా. అభివృద్ధి అన్నా కేవలం ప్రచారానికి మాత్రమే పనికి వస్తాయి. ప్రజలకు అందాల్సిన ఆవసరం లేదు అనుకుంటారాయన. ప్రజల కోసం ఏమీ చేయరు కాని నెలకు 15 రోజులు ఢిల్లీకి వెళ్తుంటారు, వస్తుంటారు. అక్కడికి వెళ్లి ఏమైనా ఒరగబెట్టారా? అంటే, ఆయన సమక్షంలోనే ఈ విభజన మొదలైంది. ఇక ఈ ముఖ్యమంత్రి పనికొచ్చేవారో, పనికిమాలినవారో ఆ పార్టీయే చెప్పాలి.’’
- షర్మిల