తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ రాజీనామా
న్యూఢిల్లీ: తరుణ్ తేజ్‌పాల్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి గురువారం రాజీనామా చేశారు. లైంగిక వే ధింపుల వ్యవహారంలో ఒక స్త్రీవాదిగా తన మనస్సాక్షి మేరకు వ్యవహరించానని, అయినా తనపై ఆరోపణలు రావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. అందుకే తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ వేధింపుల కేసులో మరింత సమర్థంగా వ్యవహరించాల్సిందన్న సూచనలను నేను అంగీకరిస్తున్నా. అయితే నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడం లేదు. నా నిజాయతీని సహోద్యోగులతోపాటు చాలా మంది ప్రశ్నించారు.
నన్ను అడ్డం పెట్టుకొని తెహెల్కాపై బురద చల్లాలనుకునే వారికి నేను అవకాశం ఇవ్వదల్చుకోలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. తేజ్‌పాల్ లైంగిక వేధింపుల అంశాన్ని అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు, కేవలం బాధితురాలికి క్షమాపణ చెప్పించి రాజీ కుదిర్చేందుకు యత్నించారని షోమాపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. బాధితురాలికి షోమా న్యాయం చేయ డం లేదని ఆరోపిస్తూ తెహెల్కాలోని పలువిభాగాల ఎడిటర్లు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించినందుకు షోమా పేరును కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
షోమా ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల హంగామా
బీజేపీ కార్యకర్తలు గురువారం ఢిల్లీలోని షోమా ఇంటి ముందు ధర్నాకు దిగారు. లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి అన్యాయం చేయాలని చూసినందుకు ఆమెను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. షోమాకు, తేజ్‌పాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలసి షోమా నివాసానికి చేరుకున్న పార్టీ నేత విజయ్ జోలీ.. నానా హంగామా చేశారు. షోమా చౌదరి ఇంటి ముందున్న నేమ్‌ప్లేట్‌పై అక్యూస్డ్ (నిందితురాలు) అని రాశారు. ఇంటిముందు నల్ల పెయింట్ వేశారు. ఈ నిరసన మధ్యే షోమా తన ఇంటినుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టి ముఖంపై సిరా చల్లడానికి ప్రయత్నించారు. కొందరు కార్యకర్తలు షోమా కారుపైకి ఎక్కారు. పోలీసుల సాయంతో ఆమె జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. తాము వారించినప్పటికీ జోలీ నిరసన ప్రదర్శన నిర్వహించారని ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.
మహిళా కమిషన్‌కు షోమా క్షమాపణలు
లైంగిక వేధింపుల కేసులో సరైన చర్యలు తీసుకోనందుకు షోమా చౌదరి గురువారం జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ)కు క్షమాపణలు చెప్పారు. కమిషన్ గోవా ఇన్‌చార్జి షమీనా షఫీక్‌ను కలసి ఈ మేరకు క్షమాపణలు కోరారు. సంస్థలో ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయకపోవడం తప్పిదమేనని చెప్పారు.