'నన్ను ఉరి తీయాలంటారా?'
న్యూఢిల్లీ: మాజీ మంత్రి సందీప్ కుమార్ వీడియో టేపు వ్యవహారంపై స్పందిస్తూ ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ ఓ టీవీ చానెల్ కు రాసిన కాలమ్ వివాదాస్పదమైంది. మహిళలపై అభ్యంతరకమైన కామెంట్లు చేశారంటూ ప్రతిపక్షాలు ఈ మేరకు కేంద్ర మహిళా కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులు స్వీకరించిన సీడబ్ల్యూసీ ఆప్ నేత అశుతోష్ ను తన ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
సీడబ్ల్యూసీ ఆదేశాలపై స్పందించిన అశుతోష్.. కాలమ్ రాస్తే తనను ఉరితీస్తారా? అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. భారత్ నియంతృత్వ దేశంగా మారుతోందా? అంటూ మరో ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది బడా నేతలకు చీకటి చరిత్రలు ఉన్నాయని అశుతోష్ కాలమ్ లో రాశారు. వాటి కారణంగా వారు రాజకీయం ఏనాడు నష్టపోలేదని అన్నారు. మీడియా సందీప్ విషయంలో ఎక్కువగా స్పందించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. పలు రకాల దృష్టి కోణాల కారణంగా పార్టీ సందీప్ ను తొలగించిందని ఆయన తన కాలమ్ లో పేర్కొన్నారు.
అశుతోష్ విచారణకు హజరుకావాలనే ఆదేశాలపై ఎన్ డబ్ల్యూసీ చైర్మన్ లలిత కుమారమంగళం మీడియాతో మాట్లాడారు. గురువారం ఎన్ డబ్ల్యూసీ ముందు హాజరుకావాలనే ఆదేశాలను అశుతోష్ గౌరవిస్తారని భావిస్తున్నామని అన్నారు. సందీప్ కుమార్ ను సమర్ధిస్తూ ఆయన కాలమ్ లో రాసిన విషయాలు తప్పని ఒప్పుకోవాలని అన్నారు. అశుతోష్ రాసిన కాలమ్ మహిళలను కించపరిచేవిధంగా ఉందని చెప్పారు.