న్యూఢిల్లీ: సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాల(ఐటీఆర్)ను ఈ నెలాఖరుకల్లా తీసుకొచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐటీఆర్‌లలో పన్ను చెల్లింపుదార్లు(అసెస్సీ) తమ విదేశీ ప్రయాణాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించాలని పేర్కొనడంపై అటు పార్లమెంటు సభ్యులతో పాటు పరిశ్రమవర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. దీంతో వీటిలో మార్పుచేర్పులు చేసి కొత్త ఫారాలను తీసుకొస్తామని ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో ప్రకటించారు. ఈ నెలఖరులోగా సరళీకృత ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారాలపై జైట్లీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అంతర్గత సమావేశం జరగనుందని కూడా వెల్లడించారు. కాగా, కొత ఫారాల్లో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు, కనీస బ్యాలెన్స్‌లేని ఖాతాల వివరాల వెల్లడిని మినహాయించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన సమాచారానికి కూడా వెసులుబాటు ఇవొచ్చని భావిస్తున్నారు. వేతనజీవులు... వ్యాపారం/వృత్తిగత ఆదాయాలు లేని వ్యక్తులు ఐటీఆర్-1/ఐటీఆర్-2లతో తమ రిటర్న్‌లను జూలై 31కల్లా సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఫారాలు 14 పేజీలు ఉన్నప్పటికీ.. సాధారణ పన్ను చెల్లింపుదారులు తొలి 2-3 పేజీల్లో వివరాలిస్తే సరిపోతుందని.. మిగతావి అధిక ఆదాయవర్గాల కోసం మరిన్ని వివరాలకు సంబంధించినవిగా అధికారులు చెబుతున్నారు.
నెలాఖరుకల్లా సరళీకృత ఐటీఆర్ ఫారాలు
Published Mon, May 11 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement