
స్మార్ట్ ప్యాచ్‌లతో అప్పటికప్పుడే ఇన్సులిన్
మధుమేహంతో బాధ పడుతూ పూటకోసారి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోలేక సతమతమవుతున్నారా? మీలాంటి వాళ్ల కోసమే ఉత్తర కరోలినాలోని యూఎన్‌సీ డయాబెటిక్ కేర్ సెంటర్ పరిశోధకులు ఓ స్మార్ట్ ప్యాచ్‌ను కనుగొన్నారు.
మధుమేహంతో బాధ పడుతూ పూటకోసారి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోలేక సతమతమవుతున్నారా? మీలాంటి వాళ్ల కోసమే ఉత్తర కరోలినాలోని యూఎన్‌సీ డయాబెటిక్ కేర్ సెంటర్ పరిశోధకులు ఓ స్మార్ట్ ప్యాచ్‌ను కనుగొన్నారు. ఈ ప్యాచ్‌లో కనురెప్ప వెంట్రుకలంత సన్నటి వంద సూదులు ఉంటాయి. ఈ ప్యాచ్‌ను శరీరానికి అతికించుకుంటే శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడల్లా దానికి అనుగుణంగా ప్యాచ్‌లోని సూదులు స్పందించి వెంటనే అవసరమైన స్థాయిలో ఇన్సులిన్‌ను రక్తంలోకి విడుదల చేసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. ఈ పరిశోధన వివరాలను అమెరికా నుంచి వెలువడే 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ సెన్సైస్' మ్యాగజైన్ తాజా సంచికలో ప్రచురించారు.
బయో కంపాటబుల్ మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ స్మార్ట్ ప్యాచ్‌లో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని గుర్తించే ఎంజైమ్స్‌తోపాటు ఎప్పటికప్పుడు సూదుల ద్వారా విడుదల చేయడానికి ఇన్సులిన్ నిక్షిప్తమై ఉంటుందని యూఎన్‌సీ డయాబెటిక్ కేర్ సెంటర్ డైరెక్టర్, మ్యాగజిన్ కో ఆథర్ డాక్టర్ జాన్ బ్యూస్ వివరించారు. అంతేకాదు, ఈ ప్యాచ్ వేసుకోడానికి చీమ కుట్టినంత నొప్పి కూడా ఉండదట. తాము ఎలుకలపై చేసిన ప్రయోగాలు పూర్తిగా విజయవంతమయ్యాయని, త్వరలోనే మానవులపై కూడా ఔషధ ప్రయోగాలు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ ప్యాచ్‌లు టైప్ 1, టైప్ 2 డయాబెటిక్ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మనుషుల బరువు, వారి డయాబెటిక్ స్థాయిని బట్టి పనిచేసేలా కూడా ఈ ప్యాచ్‌లను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రస్తుతం 38.70 కోట్ల మంది ఉండగా, 2035వ సంవత్సరం నాటికి వీరి సంఖ్య దాదాపు 60 కోట్లకు చేరుకుంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.