
విమానంలో శ్వేతనాగు.. నో ప్యానిక్!
ఓ ప్రయాణికుడు తన పెంపుడు శ్వేతనాగును తనతోపాటు విమానంలోకి తీసుకొచ్చాడు. గమ్యం చేరుకున్న తర్వాత అతను విమానం దిగాడు కానీ, ఆ పాము మాత్రం అందులోనే ఉండిపోయింది. విమానంలోకి ఎక్కిన ఓ చిన్నారి బాలుడు తన సీటులోకి కూర్చున్న వెంటనే సీటు పక్కన నిద్రపోతున్న ఆ పామును గుర్తించాడు. ’అమ్మ ఇక్కడ చూడు. ఏంటిది ఏది’అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీంతో ప్రయాణిస్తున్న విమానంలో పాము ఉన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. అయితే, ఇది విషపూరితమైన పాము కాదు. ఎక్కువసేపు స్తబ్దుగా పడుకొని ఉంటుంది. దీంతో విమానంలో పెద్దగా భయాందోళన వ్యక్తం కాలేదు.
అమెరికా అలస్కా రాష్ట్రంలో అనియక్ నుంచి యాంకరేజ్ నగరానికి వెళుతున్న ప్రయాణికుల విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం తిరిగి ప్రయాణమైన సమయంలో ఓ ప్రయాణికుడు తనతోపాటు తెచ్చుకున్న పెంపుడు పాము కనిపించడం లేదని, అది విమానంలోనే ఉండిపోయిందని ఎయిర్‌పోర్టు సిబ్బందికి తెలియజేశాడు. ఇంతలోనే ఆ విమానం గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత విమానంలో పామును గుర్తించారు. అది విషపూరితమైనది కాకపోవడంతో దానిని చూసేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపారు. దానిని జాగ్రత్తగా భద్రపరిచి విమానం ల్యాండ్ అయిన తర్వాత తరలించారు.