
కాంగ్రెస్ ఎంపీలకు సోనియా విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం రాత్రి విందు ఇచ్చారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ విందు సమావేశానికి.. సీమాంధ్ర నుంచి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, కిశోర్‌చంద్రదేవ్, పళ్లంరాజు, చిరంజీవి, జె.డి.శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు ఎస్.జై పాల్‌రెడ్డి, బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌శెట్కర్, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, తదితరులు హాజరయ్యారు.
టీఆర్‌ఎస్‌తో బంధం ఖరారుకాలేదు: సింఘ్వీ
టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ బంధం ఎలా ఉండాలన్న అంశంపై తుది నిర్ణయం జరగలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ పేర్కొన్నారు. ‘తెలంగాణ, సీమాంధ్రకు సమన్యాయం చేసేందుకు కాంగ్రెస్ యత్నించినట్లుగా మరే పార్టీ చేయలేదు. అందుకు అనుగుణంగా అవసరమైన పొత్తులు పెట్టుకునేందుకు మేం సుముఖంగా ఉన్నాం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’’ అని చెప్పారు.