ములాయం ముసలోడన్న అభ్యర్థి బహిష్కరణ
పార్టీ అధ్యక్షుడిని ఎవరైనా 'ముసలోడు' అంటే ఊరుకుంటారా? అందులోనూ సమాజ్వాదీ పార్టీ లాంటి చోట్ల అసలు కుదరదు కదా. అయినా ఆ విషయం గుర్తులేని ఓ అభ్యర్థి.. సరిగ్గా ఇదే వ్యాఖ్య చేశారు. ఆగ్రా లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని అయిన సారికా బఘెల్, ఆమె భర్త దేవేంద్ర సింగ్ స్వయంగా ములాయం సింగ్ యాదవ్ మీదే ఆయన ముసలోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతో వారిద్దరినీ వెంటనే పార్టీనుంచి బహిష్కరించి అవతల పారేశారు.
వెంటనే ఆగ్రా స్థానానికి కొత్త అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. మహారాజ్ సింగ్ ఢంగర్ ఈ స్థానంలో పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తెలిపారు. దేవేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం ఓ ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఓ అధికారితో గొడవపడ్డారు. మహాత్మా గాంధీ రోడ్డులో ఆటోరిక్షాలను తిరగనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సరిగ్గా అప్పుడే ములాయం సింగ్ యాదవ్ను 'ముసలోడు' అన్నారు. ఆ విషయం వెంటనే పార్టీ వర్గాలకు చేరిపోయింది. అంతే, భార్యాభర్తలిద్దరినీ పార్టీనుంచి బహిష్కరించేశారు.